తంతువు

ఏదో హృదయతంతువు లాగి వదలబడుతున్న భావం
అల్లెత్రాటిపోగులను బాణం విడుస్తున్న వేళ
కోడిపిల్ల బయటకు వచ్చే తపనలో పెంకుపై ఏర్పడుతున్న నెర్రెల పోలిక
సీతాకోకచిలుక తన గూడును చీల్చుకుని స్వేచ్ఛా ప్రపంచంలోకి బయలుదేరుతున్న దృశ్యం
శకుంతలకు అత్తవారింటి జాగ్రత్తలు చెప్పి సాగనంపుటకు కదులుతున్న కణ్వుని అంతర్వాణి
తన కొడుకుకు సుద్దులు నేర్పి పులి వద్దకు ఆహారంగా కదలబోతున్న ఆవుతల్లి ముంగాలు
ఇవేవీ సరిపోలవేమో మరి పోల్చడానికి
తన విద్యార్థులు వీడిపోతున్న వేళ ఉపాధ్యాయుని భావవైవర్ణాన్ని.
కనుచూపునుండి దూరమవబోతున్న ఆ తరగతి గోడలను, తలుపులను, కిటికీలను.
ఇన్నాళ్ళూ సహచరులుగా మసలిన తోటి పిల్లలను.
ఇదంతా అర్థం అవుతుందా.
వెలువడబోతున్న శబ్దతరంగానికి,
దూసుకుపోబోతున్న బాణానికి.
ఆ కోడిపిల్ల తపనకు
సీతాకోకచిలుక రెక్కలలో ప్రోదిచేసుకున్న ఉత్సాహానికి
భర్త పలకరింపు తెలియని శకుంతల మోహాతీతమైన మనసుకు.
అనాథగా మిగలబోతున్న అన్నుల మిన్నకు.

Comments

Madhavi tiru said…
Hrudaya thantrulanu meeting mee tanthuvu chala hrudyanga undi..naaku mana madanna PETA nundi vacheepudu elati bhaavale kaligaye andarini n mokkalani vadili velladam chala kastaga anipinchindi ..intha Machi bhaavalanu panchukundanku dhanyavaadalu sir
sharmakkv said…
2008లో శాలిబండ స్కూల్ లో పదోతరగతి పిల్లలకు ఫేర్ వెల్ సందర్భంగా రాసుకుని వినిపించిన కవిత. ఇప్పటికీ చదువుతుంటే తాజాగా అనిపిస్తుంది.
అందుకే దాదాపు అందరికీ అనిపించే భావనలే అని షేర్ చేసాను.
మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు.

Popular posts from this blog

టీచర్

బాలల రామాయణం

మా 'సారు'