మహిళా సాధికారత

సాధికారత అంటే స + అధికారత అని అర్థం. అధికారంతో కూడిన అని. అది సంపాదనలోనో ఇతరత్రానో సమానహోదా అని కాకుండా నిర్ణాయక శక్తి అని అర్థం చేసుకుంటేనే సముచితంగా ఉంటుంది.
నేటి మహిళ నిన్నటి మహిళ కంటే ఆర్జనలో మంచి స్థితిలో ఉన్నది. అందుకు మారుతున్న ఆర్థికపరమైన వత్తిళ్ళే ముఖ్యకారణం అని చెప్పవచ్చు. చదవడంలో వచ్చిన స్వేచ్ఛ, కుటుంబ సంపాదనలో తప్పని సరైన భాగస్వామ్యం ఆర్థికంగా స్వావలంబనదిశగా మహిళను పయనమయేలా చేస్తున్నాయి.
పది పదిహేనేళ్ళ క్రితం వరకు శారీరక శ్రమ అనే అంశం మహిళకు పని అవకాశాన్ని నిర్ణయించేది. పదేళ్ళ క్రితమే బస్సులలో కండక్టరుగా స్థానం పొందగలిగింది మహిళ. ఇప్పటికీ కనీసం ఆటో నడిపించటానికి శక్తి సరిపోనిదిగానే భావించబడుతోంది. అయితే కనీసం ద్విచక్రవాహనాల లైసెన్సు పొందగలిగే ఆమోదాన్ని పొందగలిగిందనే సంతోషమే కొంత ఊరట.
పై అంశాన్ని గమనించినపుడు సమాన అవకాశం లభించడంలేదు అనిపిస్తుంది. లేదా సమాన అవకాశం పొందడంలో వివక్షతకు గురౌతున్నట్టుగా అనిపిస్తోంది. అయితే సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో మహిళల ఉద్యోగితను ప్రస్తావించుకున్నపుడు ఫరవాలేదనిపిస్తుంది. ఈ అవకాశం లభించడానికి కారణం శారీరక శ్రమ అనే అంశం లేకపోవడమే అనిపిస్తుంది. అయితే షిఫ్టు పద్ధతులలో పనిచేయాల్సి వచ్చిన సందర్భాలలో మళ్ళీ భద్రత అనే అంశం మళ్ళీ వెనుకకు లాగుతుంది. అందుకు రానుపోను మార్గంలో జరిగే సంఘటనలు ప్రభావితం చేస్తాయి. ఇందుకు గత నాలుగైదేళ్ళలో జరిగిన దారుణాలే తార్కాణం.
అంటే శారీరక శ్రమ, వ్యక్తిగత భద్రత, తన పరిధులలో లేదా సమాజం ఆమోదించిన పరిధులను దాటని నిర్ణయాత్మక శక్తి అనే అంశాలు మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతలను ప్రభావితం చేస్తున్నాయనవచ్చు.
వ్యక్తిగత అంశాల నుంచి కుటుంబం, కుటుంబం నుంచి పరిసర సమాజం, సమాజం నుంచి రాజ్యాధికారం ఈ విధంగా ప్రతి స్తరంలోను ఈ మహిళా సాధికారం అనేది పరీక్షకు గురౌతూనే ఉంటుంది, అప్పటి అవసరాన్ని గుర్తింపజేస్తూనే ఉంటుంది.
ప్రస్తుతం తనకు మాత్రమే సంబంధించిన వ్యక్తిగత నిర్ణయాలలో మహిళ ఎంతవరకు సాధికారాన్ని తన కుటుంబంచేత పొందగలిగింది అనే ప్రశ్న ఎంత జటిలమో తెలిసిందే. భర్తతో సమాన బాధ్యత అనుకుంటున్న లేదా చెప్పబడే సంతాన పరిమితి నుంచి సంతానం భవిష్యత్తు వరకు ఎంత వరకు నిర్ణయాత్మకంగా ఉండగలుగుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగులుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది. కారణం సులభంగా ఊహించదగిందే. అదే కుటుంబం నుంచి లభించే భద్రత. ఇక్కడే ప్రాథమికంగా సాధించాల్సిన సాధికారత అనిపిస్తుంది. ఎపుడైతే ఈ ప్రాథమికమైన భద్రతపై నమ్మకం కలుగదో అంతవరకు కుటుంబం పట్ల తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదనే చెప్పాలి. ఇది మొదటి మెట్టు.
అయితే ఈ మొదటిమెట్టు దగ్గరే ఇంకా 99శాతం మహిళలు ఆగిపోతున్నారనుకోవాలి. ఎందుకంటే రాజకీయంగా మహిళలకు సాధికారతను సంపాదించాలన్న సదుద్దేశంతో లోకల్ బాడీలలో ఉన్న మహిళారిజర్వేషన్లు ఎలా భర్తల పాలిటి కల్పతరువులా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. లోకల్ బాడీలలో సాధించలేని సాధికారతను పక్కన పెట్టి శాసనసభల్లో, పార్లమెంటులో రాజకీయ రిజర్వేషన్లు సాధించే పరిస్థితి అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది. అథవా వచ్చినా ఆ అధికారాన్ని నిలుపుకునే అవకాశం ఉన్నదా అనిపిస్తుంది.
మహిళా సాధికారతకు రాజకీయ రిజర్వేషన్లు సంకేతంగా కనిపించవచ్చు. అసలైతే అది సహేతుకమే. సామాజిక సంబంధ నిర్ణయాలలో అధికారాన్ని కలిగి ఉండటమే అత్యున్నత సాధికారతకు సంకేతం. తప్పనిసరి పరిస్థితుల్లో పురుష రాజకీయనాయకుల అవసరార్థం రాజకీయ పార్టీల అధ్యక్షురాళ్ళుగా కొనసాగుతున్న మహిళలు, మిణుకుమిణుకు మంటున్న శాసన మండలి సభ్యురాళ్ళు దీనిని సాధించగలుగుతారా అనేది శేషప్రశ్నే.
ఒక మహిళ అనేక మహిళల కుటుంబాల సంక్షేమం కోసం చేపట్టిన సారావ్యతిరేకోద్యమం ఎలా నిర్వీర్యం కావించబడిందో పరిశీలిస్తే సాధిద్దామనుకుంటున్న రాజకీయ రిజర్వేషన్లు కూడా కంటితుడుపు చర్యగా మిగిలిపోయే ప్రమాదముంది. ఆ ఉద్యమం తరువాతే ఈ మహిళాస్వయం సహాయక సంఘాలు, వగైరా మార్పులు సంభవించడం గమనించవచ్చు. భర్తలు తాగి ఇంటి బాధ్యతలు పట్టించుకోకున్నా భార్యనే ఆ స్థానం తీసుకునేలా ప్రోత్సాహకంగా మొదట్లో కనిపించినా దానిని కూడా రాజకీయ అవసరాలకోసం వాడుకోవడం గమనిస్తున్నాం. ఈ పరిస్థితులలో మహిళా రాజకీయ రిజర్వేషన్లను కంటితుడుపు చర్యగానే భావించడంలో తప్పేమీ కాదనిపిస్తుంది.
ఈ పరిస్థితులలో ఇంకా కలకంఠి కంట కన్నీరొలికిన... అన్న వర్ణనాత్మకమైన పాత్రనే పోషిస్తున్న మహిళ, అప్పుడప్పుడూ ఆకాశంలో సగం.. అని పొగిడించుకున్నా అది క్షణికంగానే మిగిలిపోతున్నది. ఇంద్రానూయీ వంటి సాధికార మహిళలూ మిణుకుమంటుంటారు.
అయినా నిరుత్సాహ పడకుండా సాధికారతకు దీక్షా కంకణం కట్టుకోవలసిందే.
సులభంగా సాధిస్తే ఆ విజయానికి ఏం విలువ ఉంటుంది. కష్టపడ్డాడు కనుకనే భగీరథునికి ఆ గౌరవం దక్కింది.

Comments

Sharmajee! Mee mahilaa vishleshana baagundi. Yedemainaa aayuvupattukutumbame.gounaalu thaditharaalu.
Krishna said…
చూడ చక్కని విశ్లేషణ వాస్తవిక దృశ్యాల సందర్శన ఈ సాధికారత విషయ వీచిక

Popular posts from this blog

టీచర్

మా 'సారు'

అక్షరాల మురమురాలు (వాట్సాప్ స్టేటస్ సీరియల్ వ్యాసం)