నా పాతనగరం - ఆ పాతమధురం

ఎవరన్నారు పాత నగరం మారలేదని ...
ఒకప్పుడు కేవలం ఇరానీ చాయ్ లు బన్నులు
 ఇప్పుడు బన్ను బదులు ఇడ్లీ వడలు 

ముందు ఎంత దూరం పోయినా సమోసాలే గతి 
ఇప్పుడు గల్లీ గల్లీలో టిఫిన్ సెంటర్లకు వసతి 

ఒకప్పుడు కప్పలు చేరిన చెరువుల్లో 
నేడు వినిపిస్తున్న వేలవేల మనుషుల అలజడి 

కనిపించని ఆటస్థలం 
ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ స్థలం 

సందుల్లోకి క్యాబులు దూసుకొస్తున్నాయి 
గూగులమ్మ ప్రతి గల్లీ చూపిస్తున్నది 

పెంకుటిండ్లు మిగలలేదు 
రేకుల ఇళ్ళు కూలుతున్నాయి 
అపార్ట్ మెంట్లు మొలుస్తున్నాయి.

దూరపు కొండలు నునుపు
కానీ అదేమిటో ...
మా ప్రాంతం మాత్రం అందరికీ గరుకు 
కాదు కాదు వారందరికీ బెరుకు.

ఇక్కడ...
పండుగల జషన్ లలో  పోటాపోటీ ప్రదర్శనలు 

బావులు లేని బౌలీలు 
తలాబ్ లేని కట్టలు 
ఆటలు లేని మైదానాలు 
మనుషులు తగ్గిన జనాజాలు 

సాలార్జంగ్ మ్యూజియంలో చిత్ర విచిత్రం 
నడిరోడ్డుపై ముసుగులు కప్పుకునే మతసామరస్యం

జెండాలు పార్టీలకు అజెండాలు అవుతాయి,
అప్పుడు పూచిక పుల్ల కూడా ఏనుగు అవుతుంది 
దెబ్బకు మెట్రో మావద్ద ముడుచుకుంటుంది 

ఇళ్ళ ముందు అరుగులు పోతున్నాయి 
బస్తీల్లో సీసీ కెమెరాలు వచ్చేస్తున్నాయి 

రాజ్యాలు కూల్చడంలో 
రాజకీయం చలాయించడం లో 
పాతనగరం తురుపుముక్క 
ఆపై ... అది కరివేపాకు కిందకు లెక్క

ఇంకా ఇదే నయం ...
అటువైపు నిశీధిలో పబ్బుల తళతళలు, 
మందు గ్లాసుల గలగలలు 
ఇక్కడ అర్ధరాత్రి కూడా కమ్మని రుచులు 

అక్కడ పక్కింట్లో ఎవరో తెలియదు 
ఇక్కడ ఒకరికొకరు నేనున్నాననే భరోసా.

మతాల మధ్య ఉన్నా పోటీ
ఆత్మీయతకు ఈ ప్రాంతం మేటి.

అందుకే ...
ఏడాదికోసారి బోనాల కు వచ్చి 
తాము తిరుగాడిన గల్లీలు 
తోటి నేస్తాలతో ముచ్చట్లు 
నెమరు వేసుకునే 
పాత నగర కాందిశీకులు.

17/11/2018,
వెంకట్రావ్ మెమోరియల్ హై స్కూల్, లాల్ దర్వాజా,
పాతనగర రచయితల సంఘం, హైదరాబాద్

Comments

Paatha nagaram pasa baagundi. Sharma gaari kavithaadisha baagundi.
sharmakkv said…
మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీకు పాతనగరంతో సంబంధం ఉన్నదా!!?
Krishna said…
మధురమైన అలనాటి జ్ఞాపకాలు విందు
ఈనాటి ఆధునిక హంగుల వైచిత్రత కలగలిపి చేసిన సృజన భవితకు మార్గదర్శనం ఆనాటి సజీవ దృశ్య వీక్షణం ఈసందేశం.అమోఘమైన మీచాతుర్యతకు నిదర్శనం చిత్తియ్య

Popular posts from this blog

టీచర్

మా 'సారు'

అక్షరాల మురమురాలు (వాట్సాప్ స్టేటస్ సీరియల్ వ్యాసం)