దేశభక్తి

ఏ సచ్ హై యా సప్నా...
మే 26, 2000.
రాత్రి స్నేహితులను కలిసి నల్లకుంట నుండి ఇంటికి వెళ్తున్నా. చార్మినార్ బస్ ఎక్కి ఎంట్రెన్స్ పక్కనే ఖాళీగా ఉన్న సీట్లో ఒక పక్కగా కూర్చున్నా.
ప్రశాంతంగా ఉన్న నాలో .. తక్షక్ సినిమాలోని .. ఔర్ దూర్ కహీఁ రోషన్ హువా ... ఏక్ చెహెరా... అన్న పాట చరణం మాటిమాటికీ గిరికీలు కొడ్తున్నది.
బస్ ఫీవర్ ఆస్పత్రి దగ్గర ఆగింది. ఇద్దరెక్కారు. తరువాత ఎక్కినవాడు ఫుట్ బోర్డు రెండో మెట్టు పైన అలాగే నిల్చున్నాడు. ఇంతలో బస్ మళ్ళీ పరుగెత్తనారంభించింది. అప్పుడే వెనకనుండి పరుగెడ్తూ ఓ నడివయసాయన ఎక్కబోయాడు. కాని ఎక్కలేక ఇతణ్ణేమో అన్నాడు. ఇతను ఏదో అన్నాడు. మొత్తం మీద ఆ పెద్దమనిషి మాత్రం ఎక్కలేకపోయాడు.
ఎక్కలేకపోతే ఎందుకు ప్రయత్నించాలో.. అనుకుంటూ ఖాళీగా ఉన్న సీట్లో కూర్చున్నాడు.
నువ్వే అడ్డముంటివి. ఎలా ఎక్కుతాడు. అన్నాడు నా పక్క సీటువాడు.
ఎక్కలేక పోతే నా తప్పా.. అనుకుంటూ గొణుగుతూ ఉన్నాడతను.
... ....
కొంచెం సేపయినతర్వాత నా పక్కసీటువాడు..
మన హైద్రాబాదులో ఒక్కడికీ ట్రాఫిక్ సెన్స్ లేదండీ అన్నాడు.
ఇక మద్రాస్ తోనో, బాంబేతోనో పోల్చబోతున్నాడ్రా బాబూ అనుకుంటూ ఉన్నాన్నేను.
అసలు దేశంలోనే ఇలా ఉంది... అన్నాడు వెంటనే.
అయితే ఏ అమెరికా మానసపుత్రుడేమో ... వాయిస్తాడ్రా నాయినా.. అనుకున్నా.
ప్రతివిషయంలోనూ ఇంతేనండీ.. అన్నాడతను.
ఏం చేస్తామండీ.. ఎవరి తొందరవారిదీ.. అన్నాను ఆగలేక.
ఈ బస్సులు కూడా అంతే నండీ, రెణ్ణిమిఎషాలు సరిగా ఆపరు స్టాపుల్లో.. అన్నాడు.
... ఇక మాట్లాడడం అనవసరమని ఊర్కున్నా.. మళ్ళీ ఎపుడూ వినే పాటే ఇతనినోటా వినాల్సి వస్తుందనుకుంటూ...
అసలు మేనేజిమెంటే బాగాలేదండీ మనదేశంలో. అసలు ఎడ్యుకేషనే సరిగా లేదు. ఇక మంచి సిటిజెన్స్ ఎలా తయారవుతారు.. అన్నాడు.
టీచరు కుటుంబాన్నించి వచ్చినవాణ్ణి కదా, ఎక్కడో గుచ్చుకున్నట్టుంది.
పేరెంట్సుకు మాత్రం అంత శ్రద్ధ ఎక్కడుందీ. పిల్లలకి మంచి సంస్కారం నేర్పించడానికి. ఎంతసేపూ అన్నీ స్కూల్లోనే నేర్చుకోవాలనుకుంటారు. పిల్లలింట్లో ఎక్కువసేపుంటారు కాబట్టి.. అక్కడి సంస్కారమే వంటబడుతుందన్నాను... ఉండబట్టలేక.
మీరన్నది నిజమండీ ... ఎంత వచ్చింది... ఎంత మిగిలింది అన్నదే తప్ప ఎలా వచ్చిందీ అన్నదాలోచించరండి. ఇంట్లో ఆడవాళ్ళు ఎంతసేపూ ఇదే ఆలోచిస్తారు కాని. ఇంకేదీ పట్టిలేదు...
వామ్మో మేల్ లిచ్చేమో.. అనుకున్నా. ఏమీ మాట్లాడలేదు. ఇంతలో బస్ స్టేషన్ వచ్చింది. ఇందాకెక్కినవాడు దిగిపోయాడు. ఇతను మాత్రం రూట్లో పడిపోయాడు.
ఏ పని చేద్దామన్నా తృప్తే ఉండటం లేదు... అన్నాడు.
ఏ రంగంలోనూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో దొరకదండీ.. అన్నాను.
ఎందుకూ మనమనుకుంటే దేంట్లోనైనా దొరుకుతుంది... అన్నాడు.
ఈ మనిషి నాకర్థం కాడనుకుంటూ ఉండిపోయాను. అఫ్జల్ గంజ్ వచ్చింది.
మీరు దిగుతారా ఇక్కడ ... అన్నాడు.
లేదండీ చార్మినార్ వెళ్ళాలి... అన్నాను.
ఎందుకో అడగాలనిపించి... మీరేం పని చేస్తారు.. అన్నాను, మూడ్ మార్చుకుందామని.
ఎల్ ఐ సి లో చేస్తున్నాను. .. అన్నాడు.
మనవాడు మెటీరియలిస్టిక్ కావాలికదా ఏవో ఉన్నత ఆదర్శాలు మాట్లాడుతున్నాడు అనుకున్నా. ఇదే అతనితో అన్నా. అసలు అర్థం స్ఫురించకుండా.
మొదట బి ఎస్ ఎఫ్ లో చేసేవాడినండీ... అక్కడి మేనేజిమెంటు నచ్చక రిజైన్ చేసాను. ... అన్నాడు.
ఓహో మనవాడు నానాపాటేకర్ టైపన్నమాట. అననుకున్నాను.
మన దేశంలోని అన్ని ఫోర్సుల్లో అతిస్ట్రిక్టుగా ఉండే దాన్లోనే స్మగ్లింగును ప్రోత్సహిస్తున్నారంటే చెప్పండి మిగతా రంగాలన్నీ ఎలా ఏడుస్తున్నాయో.. అంటూ ఈసడించుకున్నాడు.
మన గైడెన్స్ .... అదే పొలిటీషియన్సే అలా ఉన్నారు. ఒక్కడికీ లీడర్షిప్పు క్వాలిటీస్ లేవు ... అన్నాను, చాలా మామూలుగా.
తప్పండీ ఆ క్వాలిటీస్ ఉండాల్సింది సిటిజెన్స్ లో... అన్నాడతను.
అవును కదా ... యథారాజా తథాప్రజా అన్నప్పుడు .. ఇప్పటి రాజులు ప్రజలే కదా ... వారిలోంచే లీడర్లు తయారవుతున్నారు మరి.... .... అనిపించింది.
ఇంకా మనవాళ్ళకి సిటిజెన్ క్వాలిటీస్ రాలేదండీ.. ఎంతసేపటికీ మన ఇల్లు పక్కవాడిది లాగా లేకపోయిందే అన్న ఆలోచనే కాని మనకున్నదాన్ని ఎలా అభివృద్ధి చేసుకుందామా అని లేదు.
... .... ...
కరెంటు బిల్లు, నల్లా బిల్లు లాంటివి సరిగ్గా కడతారా .. ఎలా కట్టకుండా ఉందామనే ఆలోచన తప్ప. గవర్నమెంటు దగ్గర మాత్రం డబ్బు ఉండొద్దూ. యాభై ఏళ్ళ నుంటీ సబ్సిడీలు తిండమే. ఇప్పటికి మనకు మంచివాడు, అటువైపు ఆలోచించేవాడు దొరికాడు. కాబట్టి సరిపోయింది. లేకుంటే ఇంకో వందేళ్ళయినా ఇంతే కదా... అన్నాడు.
అనుమానంలేదు. ప్రో టిడీపీ అని నిర్ధారించుకున్నాను.
ఒక్కడు కూడా దేశం గురించి ఆలోచించడం లేదు. ... అన్నాడు.
మరి మనసంగతేంటో అనాలనిపించింది.
మనసులో ఉన్నది కనిపెట్టాడేమో...
ఇప్పటికీ మా నాన్నకీ నాకూ గొడవండీ. ఆయనేమో కరెంటు బిల్లెందుకు కట్టాలంటారు. నేనేమో కాల్చుకున్నందుకు అంటాను.... మా చిన్నాన్న నాకు నచ్చుతారు. మాకు రెండు బావుల కింద పొలాలున్నాయండీ ఊర్లో... ఇంత పంట పండించుకున్నాం. అదేదో .. మోటారు నడిచినందుకు కరెంటు బిల్ల కడితే పోలే.. అదేమన్నా పుణ్యాని కొస్తుందా ఖర్మ అనుకుంటూ కట్టడానికి .. అంటారు... అన్నాడు.
ఎందుకో జన్మభూమికి సరైన కొడుకనిపించింది.
ఇంతలో చార్మినార్ వచ్చింది. దిగాం... వెంటనే మా మాటల్నంతా వింటూన్న పక్కాయన.. ఇలా రన్నింగ్ బస్ దిగటం మంచి సిటిజన్షిప్పుకు గుర్తింపా ... అన్నాడు.
కొంచెం వెటకారం వినిపించింది మాటలో. గవర్నమెంటు ఆఫీసులో ఆఫీసరేమోలే అని సర్దుకున్నా.
నిజం చెప్పొద్దూ.. అతని చివరి మాటలు నన్ను ప్లీజ్ చేసాయి. అణచుకోలేక మీ పేరేంటి .. ఏ ప్రాంతం అన్నాను.
వేణుగోపాల రెడ్డి. మా ఊరు చిత్తూరండి... అన్నాడు.
నన్ను పరిచయం చేసుకొని నైస్ మీటింగ్ యూ .. అంటూ ఇంటివైపు బయల్దేరాను.. అతను ఆ పెద్దమనిషితో ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు.
అతని గురించి.. పెద్దవారి బాధ్యతలు, చిన్నవారి నడకలూ. లీడర్షిప్పులూ ఆలోచిస్తూ.. ఇంటికి చేరాను. భోజనం చేస్తున్నంతసేపూ ఆలోచనలే. ఇలా అయితే నిద్ర రావడం కష్టమనుకుని.. టి.వి. పెట్టాను. శుక్రవారం సినిమా చూసి మూడ్ మార్చుకుందామని.
తొమ్మిదిన్నరయినా ఇంకా సినిమా మొదలు కాలేదు.
రక్షణ మంత్రితో ఇంటర్వ్యూ వస్తోంది.
ఏంటి నాన్నా. ఇదేదో వస్తోంది.. అన్నాను.
కార్గిల్ యుద్ధం మొదలయింది ఈరోజేనట. సంవత్సరమయిందని స్పెషల్ ప్రోగ్రాం వేస్తున్నారు... అన్నారు.
అప్పుడే మర్చిపోయానా .. అనుకున్నాను.
ఇంటర్వ్యూ ఆఖర్లో...
కార్గిల్ యుద్ధమప్పుడు మనదేశ ప్రజలంతా దేశభక్తి చూపారు కదా. ఆ దేశభక్తి తరంగం ఇప్పటికీ అలాగే ఉందంటారా.. అనడిగాడు హోస్టు.
నేనొప్పుకోనండీ .. అది దేశభక్తంటే. నా దృష్టిలో వందేమాతరమనో... భారత్ మాతాకీ జై అనో అని నినాదాలివ్వడం దేశభక్తి కాదండి. ఆఫీసులో లంచం తీసుకుంటూ .. జెండా ముందు జనగణమన .. అన్నంత మాత్రాన దేశభక్తి ఉందనుకోవడం భ్రమ. అసలు ఆ శబ్దానికి అర్థం వివరించటం కూడా కష్టమేనేమో. మనవాళ్ళింకా అంత దశకు రాలేదండి... అంటూ రక్షణ మంత్రి ఇంటర్వ్యూ ముగిసింది.
మూడో మెదడు మీద దెబ్బకొట్టినట్టయింది.
ఇక రాత్రి నిద్రపడితే ఒట్టు. పాటలయినా విందామని టేప్ ఆన్ చేస్తే .. ఔర్ దూర్ కహీఁ రోషనే హువా.. ఏక్ చెహెరా.. ఏ సచ్ హై యా సప్నా.. ఏ సచ్ హై యా సప్నా... అన్నపాట వినిపించడం మొదలయింది. అదే మొహం . అదే మొహం కంటికెదురుగా మసక మసకగా కనిపిస్తూంది. ఇది నిజమేనా మరి కలా...

Comments

Popular posts from this blog

సినిమా – మనసుపై ప్రభావం – మనోవిజ్ఞాన, అలంకార శాస్త్రాల పార్శ్వం

మహిళా సాధికారత

నా పాతనగరం - ఆ పాతమధురం