మహిళా సాధికారత
సాధికారత అంటే స + అధికారత అని అర్థం. అధికారంతో కూడిన అని. అది సంపాదనలోనో ఇతరత్రానో సమానహోదా అని కాకుండా నిర్ణాయక శక్తి అని అర్థం చేసుకుంటేనే సముచితంగా ఉంటుంది. నేటి మహిళ నిన్నటి మహిళ కంటే ఆర్జనలో మంచి స్థితిలో ఉన్నది. అందుకు మారుతున్న ఆర్థికపరమైన వత్తిళ్ళే ముఖ్యకారణం అని చెప్పవచ్చు. చదవడంలో వచ్చిన స్వేచ్ఛ, కుటుంబ సంపాదనలో తప్పని సరైన భాగస్వామ్యం ఆర్థికంగా స్వావలంబనదిశగా మహిళను పయనమయేలా చేస్తున్నాయి. పది పదిహేనేళ్ళ క్రితం వరకు శారీరక శ్రమ అనే అంశం మహిళకు పని అవకాశాన్ని నిర్ణయించేది. పదేళ్ళ క్రితమే బస్సులలో కండక్టరుగా స్థానం పొందగలిగింది మహిళ. ఇప్పటికీ కనీసం ఆటో నడిపించటానికి శక్తి సరిపోనిదిగానే భావించబడుతోంది. అయితే కనీసం ద్విచక్రవాహనాల లైసెన్సు పొందగలిగే ఆమోదాన్ని పొందగలిగిందనే సంతోషమే కొంత ఊరట. పై అంశాన్ని గమనించినపుడు సమాన అవకాశం లభించడంలేదు అనిపిస్తుంది. లేదా సమాన అవకాశం పొందడంలో వివక్షతకు గురౌతున్నట్టుగా అనిపిస్తోంది. అయితే సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో మహిళల ఉద్యోగితను ప్రస్తావించుకున్నపుడు ఫరవాలేదనిపిస్తుంది. ఈ అవకాశం లభించడానికి కారణం శారీరక శ్రమ అనే అంశం లేకపోవడమే అనిపిస్తుంది. అయితే...