సినిమా – మనసుపై ప్రభావం – మనోవిజ్ఞాన, అలంకార శాస్త్రాల పార్శ్వం


వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక విధంగా, పదిమందిలో ఉన్నప్పుడు ఇంకోవిధంగా ప్రవర్తిస్తాడు. అందుకు కారణాలనేకం. ఈ కారణాల విశ్లేషణ అతని మూర్తిమత్వ విశ్లేషణ కిందికి వస్తుంది.
మనోవిజ్ఞానశాస్త్రంలో ఫ్రాయిడ్ మూర్తిమత్వ అంచనా కోసం మనోవిశ్లేషణ సిద్ధాంతం ముందుకు తెచ్చాడు. ప్రస్తుతం అధిక సంఖ్యాకులను ఇది ప్రభావితం చేస్తూంది.
ఫ్రాయిడ్ మనస్సును మూడు రంగాలుగా విభజించాడు. ఈ మూడూ కలిసి వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపుతాయి. ఒక రకంగా ఈ మూడిటి సంఘర్షణలో మానవుని ప్రవర్తన అతని మూర్తిమత్వం తెలుపుతాయంటాడు అతను. ఆ మూడు అచిత్తు (ఇడ్), చిత్తు (ఇగో), అధ్యాత్మ (సూపర్ ఇగో).
ప్రాచీన తత్త్వవేత్తలు కూడా మనసు, బుద్ధి, ఆత్మ లనే మూడు భావనలను తెలిపారు. మనసుపై బుద్ధి, బుద్ధిపై ఆత్మ తమ ప్రభావం చూపుతాయని, అలా పాజిటివ్ గా ప్రభావం చూపగలిగినపుడే మనిషి పరమాత్మ స్థాయికి చేరువకాగలుగుతాడని అన్నారు. మనసుని అదుపులో ఉంచుకోవడమంటే కోరికలను అదుపులో ఉంచుకోవడమని, మనసును అదుపులో పెట్టేది బుద్ధి అని, బుద్ధి క్రియాశీలతను నిర్ణయించేది ఆత్మ అని అన్నారు. ఇందుకు ఉదాహరణగా మనసు – రథం యొక్క గుర్రాలని, వాటికి పూన్చిన తాళ్ళే బుద్ధి అని, ఆ తాళ్ళు సారథి అదుపులో ఉన్నట్లే బుద్ధిని అదుపుచేసేది సారథి అనే ఆత్మ అని, కాబట్టి ఆత్మ సరిగా పని నిర్వర్తించినపుడే రథికుడు (మానవుడు) గమ్యాన్ని చేరుతాడని కఠోపనిషత్తు ఉదహరించింది.
ఇక ఫ్రాయిడ్ అచిత్తు లేదా ఇడ్ పుట్టుక నుండి ఉంటుందని చిత్తు లేదా ఇగో, అధ్యాత్మ లేదా సూపర్ ఇగో అనేవి వరుసగా వయసుతోపాటు పరిసరాల ప్రభావం వల్ల వృద్ధి చెందుతాయని వివరించాడు.
లైంగికత, దౌర్జన్యశీలత మొదలైనవి సహజాతాలని, అచిత్తులో ఉంటాయని ఆ విధంగా అచిత్తు ఆనంద సూత్రంపై పనిచేస్తుంది అంటాడు ఫ్రాయిడ్. ఇక చేతన (ఇగో) పరిసరాలను దృష్టిలో ఉంచుకొని సమాజ నిర్ణయాలపై (వాస్తవిక సూత్రంపై) ఆధారపడి ఇడ్ నుండి పుట్టే కోరికలను అదుపులో ఉంచుతుంది. ఆ విధంగా ఇడ్ –ఇగోల మధ్య సంఘర్షణ జరిగినపుడు ఇడ్ విజయం సాధిస్తే జంతుసంబంధ వాంఛలు తీరుతాయి. ఇగో విజయం సాధిస్తే ఆ కోరికలు అణచివేయబడతాయి. ఈ సంఘర్షణలో మానవుని ప్రవర్తనే అతని మూర్తిమత్వాన్ని నిర్ణయిస్తుంది. ఇక్కడి వరకూ మానసిక వర్గ సంఘర్ణణను వివరించిన ఫ్రాయిడ్ సూపర్ ఇగోను ప్రత్యేకంగా ముందుకు తీసుకువచ్చాడు. ఇది నీతిసూత్రంపై ఆధారపడి మానవునికి మూలమైన మానవత్వాన్ని విజయం చెందేలా చేస్తుంది. ఇది ఇగో పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ విధంగా ఇడ్ పై ఇగో, ఇగో పై సూపర్ ఇగో వరుసగా ప్రభావం చూపుతాయి. ఇదే వరుస చర్యల్ని భారతీయ తత్త్వవేత్తల వివరణలో చూడవచ్చు. ఉత్తర రామాయణంలోని రంభారావణ సంవాదం ఇందుకు ఉదాహరణ.
జాగ్రత్తగా గమనిస్తే ఫ్రాయిడ్ ఇడ్ ను భౌతికవాదానికి దగ్గరగా ఒక పదార్థంగా చూడడం, భారతీయ తత్త్వవేత్తలు మనసును పదార్థగతమైన కోరికల సమాహారంగా పరిగణనకు తీసుకున్నట్టు అనిపిస్తుంది. అందువల్ల రెండిటిలోనూ సూక్ష్మభేదం కనిపిస్తుంది. దీన్ని పైన చూపిన విధంగా చిత్రీకరించవచ్చు. సౌలభ్యం కోసం ఫ్రాయిడ్ భావనను మధ్యలో తీసుకోవడం జరిగింది..
........
ఫ్రాయిడ్ (సైకాలజీ) అంతటితో ఆగిపోగా .... భారతీయ తత్త్వేత్తలు ఇంకా ముందుకు సాగి మనసు, బుద్ధి, ఆత్మల ఔన్నత్యదిశగా మార్పు కోరుతూ ఆధ్యాత్మిక దృష్టితో, అందుకు చేయాల్సిన, ప్రయత్నించాల్సిన అవసరాన్ని,విధానాన్ని యోగదర్శనం చేయించారు.
యోగదర్శనం వ్యక్తిగతమైంది. దానితోపాటే విశాలదృక్పథంతో – మానసిక వికాసానికి సాహిత్యాన్ని కూడా పరికరంగా ఉపయోగించాలనే ఆలోచన తీసుకువచ్చారు. అందుకు అనుగుణంగా ప్రభు, మిత్ర, కాంతా సమ్మితాలనే భావనను ముందుకు తెచ్చారు. ఆ విధంగా ఐహిక సుఖాలను ఇచ్చే విజ్ఞానశాస్త్రాలతో పాటు సాహిత్యశాస్త్రాలను ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఏర్పరుచుకున్నారు.
సాహిత్యానికి సంబంధించి శ్రవ్య, దృశ్య కావ్యాల లక్షణాలు, వాటిలోని అలంకారాలు, గుణాలు ఇత్యాది అసంఖ్యాకమైన చర్చలూ చేసారు. విశాలదృష్టితో శ్రవ్యకావ్యాల కంటే దృశ్యకావ్యాల ప్రభావం జనసామాన్యంపై అధికం. రూపకాలు ప్రత్యక్షంగా ప్రదర్శించబడడం – ప్రేక్షకునికి – పంచజ్ఞానేంద్రియాలలో అతిప్రధానాలైన చక్షు, శ్రోత్రేంద్రియాలపై అవిచూపే ప్రత్యక్ష ప్రభావానికి (సామూహికంగా) ఉన్న ప్రాధాన్యాన్ని గమనించినపుడు మొదటగా భరతుని నాట్యశాస్త్రం (లక్షణగ్రంథం) రావడానికి కారణం కనిపిస్తుంది. ఇపుడు అత్యధికశాతం ఒప్పుకుంటున్నట్టు ప్రదర్శనకళలు మొదట, లిఖితకావ్యాలు తరువాత వచ్చే అవకాశం కూడా ఇందుకు కారణం కావచ్చు.
....
మళ్ళీ ఒకసారి ఫ్రాయిడ్ ను పలకరిద్దాం. మనసు అనేది సంక్లిష్టమైన భావన అయినా ఈ అచిత్తు (ఇడ్) మనసులో ఎక్కువశాతం ఆక్రమించి ఉంటుంది. విచక్షణాజ్ఞానం లేనందువల్ల అచిత్తు (ఇడ్)ను దాదాపుగా భౌతికపదార్థంగా భావించవచ్చు. ఫ్రాయిడ్ ఈ అచేతన స్వప్నంలో చేతనత్వాన్ని పొందుతుంది అన్నాడు. అందుకే కలలకు మూర్తిమత్వ అంచనాలో ముఖ్యస్థానం ఇచ్చాడు. మనిషిలోని అంతర్గత కోరికలను తెలుసుకోవడానికి ఈ టెక్నిక్ ను సాధనంగా తీసుకున్నాడు. ఈ ఫ్రాయిడ్ భావనను అంగీకరిస్తే ప్రతి నిత్యమూ అచిత్తు ఆక్రమించే స్థలం ఎక్కువవుతూ ఉంటుంది. ఎందుకంటే మానవునికి తీరని కోరికలే ఎక్కువ కాబట్టి. అంతేకాక కోరికలు ఇడ్ నుండే పుడతాయి. ఫ్రాయిడ్ ప్రకారం. వావివరుసలు పట్టించుకోని ఈ కోరికలు ఇగో, సూపర్ఇగోల ప్రభావం వల్ల అణచివేయబడి ఇడ్ లోనే నిక్షిప్తమై ఉంటాయి. తగిన సమయం వచ్చినపుడు విజృంభిస్తాయి.
అపుడు గనక ఇగో, సూపర్ఇగో పనిచేయలేకపోతే సమాజంపై వ్యక్తి ప్రభావం చెడుగా ఉంటుంది.
మరి ఎప్పటికప్పుడు పెరుగుతూపోయే ఇడ్ ను కంట్రోల్ చేయటమెలా. అందుకే విద్యలో భాగంగానీతిని బోధించడం. ఆ విధంగా సూపర్ఇగో, ఇగోలు తిరిగి బలం పుంజుకుంటాయి. ఈ చక్రం ఇలా సాగుతూనే ఉంటుంది.
(ఇడ్ లో ఏర్పడే కోర్కెలు దేనికీ లొంగవని ఫ్రాయిడ్ అభిప్రాయం. అంటే ఇడ్ లో ఏర్పడే సమాజ విరుద్ధమైన కోరిక, ఇగో సూపర్ ఇగోల నియంత్రణ వల్ల, మనస్సును మరొక పనివైపు మళ్ళించడం వల్ల తాత్కాలికంగా ఆపడమే గానీ, కోరిక మనసులోంచి పూర్తిగా పోదు. విద్యావంతులు పెద్దపెద్ద అధికార స్థానంలో ఉన్నవారు సైతం మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడడం, చిన్నచిన్న దొంగతనాలు చేయడం మనం గమనిస్తాం. ముఖ్యంగా లైంగిక విషయానికి వచ్చేసరికి, ఎంతటి విద్యావంతులైనా, పండితులైనా స్త్రీని ఒక విలాసవస్తువుగా చూడడం, సందర్భం వస్తే తమ మనసులోని భావనను బయట పెట్టడం చేస్తుంటారు.
ఈ విషయంలో నిరక్షరాస్యులే కొంత నయమనిపిస్తుంది. ఎందుకంటే వారికి సమాజం పట్ల గౌరవం, భయం, భక్తి ఉన్నాయి. సందర్భం వస్తే, ప్రవర్తించే విచక్షణా జ్ఞానం వారికి భయంతో, భక్తితో వచ్చిందనిపిస్తుంది.
కాబట్టి ఇడ్ లో పుట్టే కోరికలు నిరక్షరాస్యుడికి విద్యావంతుడికి, పేదవాడికి, ధనవంతునికి ఒకేలా ఉన్నప్పటికీ సమాజం పట్ల ఉండే భయం వల్ల, బయటపడక పోగా, కొందరివిషయంలో సమాజం, చట్టం తన చేతుల్లోనే ఉన్నాయనే భ్రమతో మరికొందరిలో విచ్చలవిడితనం పెరుగుతుంది.
సున్నిత మనస్కుడైనవాడిలో తప్పకుండా విద్య, ఇడ్ ను నియంత్రిస్తుంది.
మరొక ముఖ్యకారణం – నేటివిద్యలో నీతి సూత్రాలకు స్థానం లోపించడం, విద్యార్థిని జ్ఞానం పరంగా ఉన్నత స్థానానికి చేర్చడమే కానీ, అంతర్లీనంగా నీతిని, సమాజసేవను మనం బోధించడం లేదు వ్యక్తి యొక్క కుటుంబంలో విలువల వలన, కట్టుబాట్లు, పద్ధతుల మూలంగా, అతని మూర్తిమత్వం రూపుదిద్దుకుంటుంది. సరైన మూర్తిమత్వం ఏర్పడితే సరైన విచక్షణా జ్ఞానం ఏర్పడుతుంది.)
మరి నిరక్షరాస్యుల, మానసిక వికలాంగుల (? ila anavacha ?) సంగతి ఏం చేయాలి. వారికి సరైన మార్గదర్శకత్వం చేస్తూండడమే. అది సూపర్ ఇగో పని.
ముందే చెప్పినట్టు సూపర్ ఇగో బలం పుంజుకోవడం అవసరం. దీనిని నిర్వర్తించాల్సింది అందరికి అందుబాటులో ఉండే నాటకాలు, సినిమాలు మొదలైన ప్రదర్శనకళలు.
అవి ఎంతవరకు తమ అసలైన ఈ పనిని నెరవేరుస్తున్నాయి. ప్రస్తుతానికి అతిసులభంగా సమాధానం పొందే ప్రశ్నే.
......
మరొక్కసారి మన సాహిత్యశాస్త్రాలను గమనిద్దాం. రూపకాలు వస్తువు గురించి, నాయికా నాయకుల గురించి నవరసాల గురించి విపులంగా చర్చించాయి. వీలయినంతవరకూ వాటిని ఆధారంగా చేసుకుని రూపకాలను లక్ష్యలక్షణ సమన్వయమే చేస్తూవచ్చాం. అవి చెప్పిన సూత్రాల ప్రకారం రూపకాలను రూపొందించలేదు. (ఇది అసాధ్యమేమో. లక్షణాన్ననుసరించి వస్తువును తయారుచేస్తే సృజనాత్మకతకు స్థానం ఎక్కడ ఉంది. కవయః నిరంకుశః అన్నట్టు సృజనాత్మకతకే పెద్దపీట వేయాల్సిందే. అయితే అందరు కవులు రచయితలు ప్రగతి దృక్పథాన్ని చూపనట్టే ప్రతిరూపకమూ, సినిమా ప్రగతి బోధకం కాదు. అంటే కవి లేదా రూపకకర్త ఉన్నత ఆదర్శంతో తన వస్తువును సృజన చేయాలి. అందుకు అధిక మానసిక శక్తి కావాలి.)
సృజనాత్మకత దెబ్బతినకుండా మార్గం వేసుకోవడం సాధ్యమా. ఇది ఆలోచించాల్సిన విషయం. (ఏదో పాతసినిమాల కాలంలో హీరోయిన్ జాకెట్ వేసుకుని వస్తాననే రచయిత డైలాగును తీయించి, ఇప్పుడే వస్తానని మార్పించారడ ఎవరో ప్రసిద్ధ నిర్మాత, దర్శకులు. ఆపాటి స్పృహ ఉన్నా చాలు ప్రేక్షకులను పాతాళంలో జారకుండా కాపాడడానికి. దానికి ఏమంత మానసిక శక్తి కావాలి, మనసుండాలి కాని...)
ప్రయత్నిద్దాం. ఇందుకు మరికొంత ఫ్రాయిడ్ ను ఉపయోగించుకుందాం. ఇడ్ – భౌతిక ధర్మాలు కలది అని ఒప్పుకుంటే – దాని ప్రతిస్పందన కూడా యాంత్రికమైందే అవుతుంది. సైకాలజీలో దీనికి సంబంధించిన ప్రయోగాలూ ఉన్నాయి. అందుకే ఫ్రాయిడ్ - ఇడ్, ఇగో, సూపర్ఇగోలకు ప్రేరణ ఇచ్చేది అవ్యక్తమైన శక్తి ఒకటి ఉంటుంది. అదే లిబిడో అన్నాడు. (భౌతికమైన ఇడ్ స్వయంప్రతిస్పందన లేనిది కాబట్టి లిబిడో అందించే ప్రేరణ తప్పనిసరి.) ఇక ఇగో, సూపర్ఇగోలకు పరిసర సమాజం, నీతి, ప్రేరణనిస్తాయని నమ్మవచ్చు.
ఇనుపముక్క సుత్తితో కొడుతూపోతే అది ఆ యాంత్రికశక్తిని ఉష్ణశక్తిగా చేకూర్చుకుంటుంది. అంటే దాని భౌతికస్థితిశక్తి మారుతూ ఉంటుంది.
అలాగే ఇడ్ తీరని కోరికలను చేర్చుకుంటూ దాని పొటెన్షియాలిటీని పెంచుకుంటూ ఉంటుంది. ఈ పొటెన్షియాలిటీ పెరిగి పెరిగి చేతనను (ఇడ్) కూడా మించే అవకాశం ఉంది. అందుకే దానిని సూపర్ఇగో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. (ఇనుము గ్రహించిన ఉష్ణశక్తిని పరిసరాలకు అందించి చల్లబడుతుంది. కాని ఇడ్ కు ఆ అవకాశం లేదు.)
దీన్ని గమనించినపుడు మనసుకు కూడా పదార్థ లక్షణాలే ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మనసుకూ స్థితిస్థాపక గుణాలు (Elastic nature, Plastic nature) ఉన్నాయి.
.....
ఇడ్ లో సహజంగా ఉండే లైంగిక వాంఛలు, దౌర్జన్యశీలత్వం మొదలైన వాటికి మళ్ళీ మళ్ళీ బలం ఇస్తూపోవడంవల్ల మనసు తద్వారా ఇగో దెబ్బతినే అవకాశం ఉంది. దీన్నే మనం రెచ్చగొట్టడం అంటున్నాం. ఈ రెచ్చగొట్టడం అనేది అజ్ఞాతంగా ఉండే పై స్వభావాల మీద చూపే ప్రభావం ఎక్కువ. నేడు పెరుగుతున్న హింస, నేరాలకు దీనిని కారణంగా సమాజశాస్త్రవేత్తలు ఒప్పుకుంటున్నారు.
....
అభినవగుప్తుడు రసం సామాజికునిలో నిష్పన్నమవుతుంది అంటూ – ఈ రసాస్వాదం సహృదయునికే సాధ్యం అన్నాడు. (Abhinava says that there are a few who can enjoy the drama effortlessly because their minds are clean and free from anger, illusion etc. Those who are not as pure can also witness the performance for delight, and there is for them music in the drama for subjugating their passions.) కాని అందరు ప్రేక్షకులు సహృదయులు కాలేరు కదా. (అందుకే రంగస్థలంపై కొన్ని రకాలైన సన్నివేశాలు నిషేధించడం జరిగింది. అవి కొన్ని ప్రదర్శనకు అనుకూలంగా లేకుండడం అవుతే మిగతావి ఈ కారణంగానే కావచ్చనిపిస్తుంది. ఉదాహరణకు యుద్ధం, రతి, అపానవాయువు, చావు మొదలైనవి ప్రదర్శించడం నిషేధించబడింది.) వారిని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత సంగీతానిది అని కూడా అన్నాడు. (అభినవగుప్తుడు స్థాయీభావం సామాజికునిలో రసస్థాయిని పొందుతుందని, అతడు సహృదయుడై ఉండాలన్నందున, ఈ విషయంపై మనోవిజ్ఞానశాస్త్ర కోణంలో ఆలోచించే అవకాశం ఉంది.)
ఇక్కడే రూపకాలు చక్షుశ్రోత్రేంద్రియాలను వశపరుచుకునేవి అన్నవిషయం తేలుతుంది. విద్యామనోవిజ్ఞానశాస్త్రం ప్రకారం కూడా ఐదు జ్ఞానేంద్రియాల్లో ఈ రెంటికీ ప్రాధాన్యత ఉండే రూపకాలు, సినిమాల్లో సంయమనం పాటించాల్సిన అవసరం తెలుస్తుంది.
అనునిత్యం వేగాన్ని సంతరించుకుంటున్న నేటి సమాజంలో సాంప్రదాయిక విధానాల ద్వారా తగినంత ప్రభావం చూపడం కష్టం. అందువల్లే సాంప్రదాయిక పద్ధతులను చాలావరకు అనుసరించే నాటకాలకంటే నానాటికీ సాంకేతికతను ఉపయోగించుకుంటున్న సినిమా మాధ్యమానికి ప్రాధాన్యత ఇవ్వవలసి వస్తుంది.
నాటకాలపైనే సరైన సాహిత్య విమర్శ రాని నేటికాలంలో సినిమాలపై విమర్శ చేసేందుకు తగిన వాతావరణం లేదు. అందుకు ప్రధాన కారణం క్రియాశీలంగా వ్యవహరించాల్సిన మేధావి వర్గం మొదటినుండీ సినిమా అంటే అంటరాని పదార్థంగా దూరంగా ఉంచడం. సమాజం కోసం పనిచేయాల్సిన విమర్శరంగం సమాజంపై అత్యధిక ప్రభావాన్ని చూపుతున్న సినిమాను దూరంగా ఉంచడం ద్వారా ఎంతవరకు బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు. (లిఖిత సాహిత్యంపైనే మొహమాటంతో విమర్శస్థాయిని తగ్గిస్తున్న కాలంలో ఇంత బాధ్యత తీసుకోవడం అతిశయోక్తి అవుతుందేమో.)
క్రమక్రమంగా దిగజారుతున్న సినిమాల్లోని విలువలకు మొదటగా బాధ్యత వహించాల్సింది మేధావి వర్గమే. తూతూమంత్రంగా సాగుతున్న సెన్సార్ వ్యవస్థ నిర్వీర్యం కావడానికి డబ్బు ప్రాధాన్యత ఎంత ఉందో వీరిదీ అంతే ఉంది.
ఒక ఉదాహరణ. గత రెండు మూడు దశాబ్దాల నుంచీ సినిమాల్లో పెరుగుతున్న అర్ధనగ్నత ముప్పావు నగ్నతగా ఎప్పుడో మారింది. ఇక ఆ పావు ఎందుకు మిగిలిందా అన్న తొందర కొందరిలో పెరిగినట్టే ఉంది. పాటలు వంటి సందర్భాల్లో మిగిలిన పావు భాగంపై విజ్ఞానసాంకేతిక ప్రగతి ఇచ్చిన లేజర్ టార్చ్ లు Aim చేయబడుతున్నాయి. సినిమాహాళ్ళలో (అక్కడక్కడా) వీటిని హాలులోనికి తీసుకురాకూడదన్న విజ్ఞాపనలూ కనిపిస్తున్నాయి.
( ప్రేక్షకుడు తనకు కావాల్సిన భాగాన్ని Aim చేసుకుంటున్నాడంటే అతని ఇడ్ ఇగోను ఛేదించిందనే కాకుండా సూపర్ ఇగో ఎప్పుడో నాశనం అయిందనే అర్థం. అపుడు ఎలాంటి మూర్తిమత్వ నిర్మాణం అయినట్టు. ఈ మానసిక వికలాంగత్వాన్ని చెరిపివేయడంలో సినిమావారు, సెన్సారువారు (ప్రభుత్వం), మేధావులు అందరు కలసిరావాల్సిన సమయం ఎపుడో వచ్చింది. ఎవరు ముందు పడాలి అనే ఆలోచనలో వెనుకబడితే మానసిక వికలాంగుని ఎక్స్ రే కన్ను రోడ్డుపై యథేచ్ఛగా విహరిస్తుంది. ఇప్పటికే పడి ఉండవచ్చు కూడా. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతంలోని ఒడిపస్, ఎలెక్ట్రా కాంప్లెక్స్ ల ఆధారంగా, శిశువు మొదట తల్లిని ఆతరువాత తండ్రిని ఆరాధిస్తాడు (స్తనపానం మానిన తరువాత). తన గురించి తాను తెలుసుకునే వరకు అతని దృష్టిలో తండ్రి హీరో. తరువాత తనను తాను ప్రేమిస్తాడు. తన లైంగికశక్తిని తెలుసుకుంటాడు. ఆ తరువాత అపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షితుడవుతాడు. ఈ విధంగా ఒక వరుస క్రమంలో ఆరాధనా భావం పెంపొందుతుంది. గౌరవం, ప్రేమ, ఆప్యాయతలు పంచగలుగుతారు. ప్రతి శిశువు ఎదుగుతలలో ఇంచుమించుగా ఇదే క్రమత్వం ఉంటుంది.
కానీ... నేటి టీ.వీ., సినిమాల ప్రభావంతో చిన్నపిల్లలు వాటిపట్ల ఆకర్షితులై ఆహార, పానీయాలను సైతం నిర్లక్ష్యం చేస్తూ, హీరోలను అనుకరించడం, వలన క్రమానుగత అభివృద్ధిని కోల్పోతున్నారు. కల్పిత పాత్రలు, కార్టూన్ నెట్ వర్క్ పాత్రలు పసిపిల్లల మెదళ్ళలో దూరి వారి కల్పనా శక్తిని కలుషితం చేస్తున్నాయనడం అతిశయోక్తి కాదు.
ఒకప్పుడు పిల్లలు వారి తల్లి దండ్రుల వద్ద, అమ్మమ్మ తాతయ్యలు లేక నానమ్మ తాతయ్యల వద్ద కూర్చుని రకరకాల కథలు వింటూ తమ ఊహాశక్తిని, జ్ఞాపకశక్తిని పెంపొందించుకునేవారు. వారికి అవసరమైన కథలు మాత్రమే చెప్పి పెద్దవారు మార్గదర్శకత్వం చేసేవారు.
నేటి సినిమాల వలన పిల్లలు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మెటీరియలిస్టిక్ కారెక్టర్ లుగా భావిస్తున్నారనడం అతిశయోక్తి కాదు. ఈ ధోరణి గత రెండు దశాబ్దాలుగా సాగుతున్నది కాబట్టే నేటి యువకులలో ఇడ్ – ఇగో, సూపర్ఇగో లను అధిగమించి లేజర్ టార్చ్ లను ఫోకస్ చేయించే స్థాయికి దిగజార్చిందేమో. )
.....
పిడికిలి మూసి ఉన్నంతవరకే గుట్టు అన్నట్టు ఎప్పుడయితే అర్ధనగ్నతను చూడడం అలవాటుగా మారిందో ప్రేక్షకుడు ఇడ్ లోని సహజాతాన్ని సంతృప్తి పరచుకోవడానికి మాటిమాటికీ అర్రులు చాస్తాడు. రానురాను అదీ సంతృప్తి ఇవ్వక ఇంకాస్త ఎక్కువ నగ్నతను కోరతాడు. ఇది కోరికలను అదుపులో పెట్టుకోలేనివారి పట్ల నూటికినూరుపాళ్ళు జరుగుతుంది. అంటే మొదట్లోనే తుంచివేయబడి ఉండాల్సింది. మానుగా పెరిగిన తరువాత పెకిలించలేము కదా.
మాదకద్రవ్యానికి అలవాటు పడిన తరువాత ఎక్కవ డోసేజి ఎలా అవసరమౌతుందో ఇదీ అంతే. ఇలా ఇడ్ (యాంత్రికంగా) పెరిగి పెరిగి పొటెన్షియాలిటీ ఎక్కువ కావడమే ఇందుకు కారణం. దీన్ని ఇగో అణచడానికి వీలు కాని పరిస్థితి హాలులోని చీకటి. అంటే చీకటిలో తప్పు జరుగుతూనే ఉంటుంది. చలనచిత్రానికి చీకటి అవసరం కాబట్టి పదిమందిలో కలిసి కూచున్నామనే వాస్తవికతను, విచక్షణను కోల్పోవడం వల్లే లేజర్ టార్చ్ ను తీసుకువస్తున్నాడు సామాజికుడు. తనకు ఇంకాస్త అనువుగా ఉంటుందని.
ఈ పరిస్థితిని తొలగించడానికి ఒకేఒక మార్గం దర్శకనిర్మాతల దృక్పథం మారడం. మారకపోతే మార్చాల్సిన బాధ్యత మేధావి వర్గంపై పడుతుంది.
ప్రేక్షకుడు నటిలోని తనకు కావాల్సిన భాగాన్ని, ఎయిమ్ చేసుకోని పరిస్థితి రావాలంటే సినిమా మీడియంలో మార్పు రావాలి. ఆ పరిస్థితిని తీసుకురాగలిగినపుడే విమర్శకుడు అనే మేధావి విజయంగా నిర్ణయించవచ్చు.
....
ఇక అభినవగుప్తుడు రెండో ప్రాధాన్యతనిచ్చిన సంగీతం తీసుకుందాం. ప్రస్తుతానికి పాటలకే పరిమితమవుదాం. సాహిత్యం మిణుకుమిణుకుమంటున్న ఈ సమయంలో అందులోని రచనకు తోడు నేపథ్యంగా కూజితాలను కూడా చేర్చి వాత్సాయన ప్యాకేజీలను ఆఫర్ గా ఇస్తున్నారు సంగీతదర్శకుడు, నిర్మాత, దర్శకులు. ఆ వ్యాపారం సంగతి సరేకాని సాహిత్యమూ, చెవులు దద్దరిల్లే శబ్దమూ (చెవి కూడా పదార్థమే కాబట్టే ఒక స్థాయిని మించి (70 డెసిబిల్స్) పనిచేయలేదు. అంటే ప్లాస్టిసిటీకి చేరుతున్నది అని అర్థం.) పక్కన పెట్టి వేగం గురించి మాత్రమే చెప్పుకుందాం. ముందు దృశ్యం విషయంలో చెప్పుకున్నట్టే ఇక్కడా రెండు బీట్స్ మధ్య ఉండే సమయం తగ్గుతూపోవడం వల్ల మనసు స్పందించడం అంతకంతకు యాంత్రికంగా మారుతున్నది. (భారతీయ శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో వివిధ పరికరాలను ఉపయోగించి క్రమంగా వేగం పెంచుతూ తారాస్థాయికి చేరి తిరిగి క్రమంగా సాధారణ స్థాయికి రావడం గమనిస్తాం. సామాజికుడిని ఆ స్థాయివరకు ఉత్తేజితుణ్ణి చేసి, తిరిగి ఆ ఉత్తేజాన్ని తగ్గిస్తూ సాధారణ స్థాయికి తేవడంలోనే ఆ సంగీతానికి ఉన్న ప్రత్యేకత తెలుస్తుంది. ఇక్కడా మనోవిజ్ఞానపార్శ్వం ఉంది. మనసు నిర్మలంగా మారడం కోసం శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించడం గమనించవచ్చు.)
మొదట్లో సాధారణ సినీ సంగీతానికి జానపదం కలిసిన తర్వాతే ఈ వేగం అందుకున్నట్టు అనిపిస్తుంది. అది రానురాను వేగం పెరుగుతూనే ఉంది.
హాస్యసందర్భాల్లో ఈ వేగం అవసరమౌతుంది. అయితే శృంగారం ముఖ్యస్థానం పొందుతున్న పాటల్లో ఈ వేగం అనవసరమేమో. దీన్ని నియంత్రించడం సంగీతదర్శక, దర్శక, నిర్మాతల మానసికస్థాయిని బట్టి ఉంటుంది.
అరుదుగా తప్పితే చాలా వరకు సంగీత దర్శకులు సంయమనంతోటే ఉన్నారని ప్రస్తుతానికి అనుకోవచ్చు. సంగీతం గురించి ఎందుకు ప్రస్తావించాల్సివచ్చిందో ఒక ఉదాహరణ చూస్తే అర్థం అవుతుంది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మొదట్లో రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారం కోసం ఒక ఆల్బం విడుదల అయింది. అందులో ఒక పాట .... క్యాతీర్ చలా తేరే దుష్మనోఁపే .... జియో జియో జియో భుట్టో బేనజీర్ ... అంటూ సాగుతుంది. భారత్ పై వెయ్యేళ్ళు యుద్ధం సాగిస్తామని భుట్టో, ఆయన కూతురు బెనజీర్ కూడా ప్రకటించారు. ఈ పాటకు బీట్ అయిన అరబిక్ సంగీత శైలి ఉత్సాహంగా సాగుతుంది. ఈ బీట్ విన్నపుడల్లా ఆ ఇద్దరికీ భారత్ పై ఉన్న ద్వేషమే గుర్తుకు వస్తుంది. కాని మరొకటి రాదు.
(ఈ బీట్ ను సినిమా పాటలకు శృంగారానికి నేపథ్యంగా ఉపయోగించుకున్నాం. అంతే కాకుండా ఈ పాటనే గణేశ నవరాత్రుల్లోను ఆర్కెస్ట్రాలు పాడుతుంటే ఈ ఉత్సవాలను భారతజాతి సమైక్యత కోసం ప్రారంభించిన ఆ తిలక్ ఆత్మ ఎంత క్షోభిస్తుందో కదా.)
బీట్ అనేది విచక్షణశక్తిని ఎంత నిర్వీర్యం చేస్తుందో దీని వల్ల తెలుస్తుంది. సంగీతానికి ఎల్లలు లేకపోవచ్చు. అయితే విచక్షణ కోల్పోయిన హద్దులు సమంజసమా అన్నది ప్రశ్న.
ఇలా గమనిస్తూ పోతే ఎన్నో అంశాలు (రౌద్రం, భయానకం, మకిలి హాస్యం మొదలైనవి) సినిమా సంస్కృతి నేపథ్యంగా ఒక్కొక్కదాన్ని వివరించుకోవచ్చు.
ఏమైనా నిరక్షరాస్యుల ఎక్కువగా ఉన్న సమాజాన్ని మేధావులే (విమర్శకులే) కాపాడాలి. ఇగో, సూపర్ ఇగో లకు బలం చేకూర్చాలి.

Comments

Popular posts from this blog

టీచర్

మా 'సారు'

అక్షరాల మురమురాలు (వాట్సాప్ స్టేటస్ సీరియల్ వ్యాసం)