పాఠశాల మాధ్యమంలో తెలుగు విద్యార్థి.. ఉపాధ్యాయుల పరిస్థితి

ఆరోజు ఎర్లీ మార్నింగ్ మెలకువ వచ్చి డైలీ పేపర్ కోసం వెయిట్ చేస్తూ, టీ సిప్ చేస్తున్నా. యాజ్ యూజువల్ గా లేట్ గా 'పేపర్' అంటూ - పడేసి వెళ్ళిపోయాడు. మెయిన్ న్యూస్ చూసి సెకండ్ పేజీ తిప్పేసరికి చాలామంది ప్రముఖుల ఫోటోలు "మాతృభాషా దినోత్సవం” సందర్భంగా కనిపించాయి. 

రాత్రి ఏదో చానెల్ లో ఇదే సందర్భంగా వచ్చిన ఒక చర్చలో ఒక ప్రముఖుడు మాతృభాషలో విద్యాభ్యాసం ,చేయకపోవడం వల్లే పరిశోధనారంగంలో వెనుకబడిపోతున్నామన్నారు ఎందుకు? 

విజ్ఞానశాస్త్రాలను సరిగ్గా అవగాహన చేసుకోలేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. రష్యా, జపాన్, చైనా మొదలైన దేశాలలో - ఇంగ్లీషు రాకపోయినా వారు వెనుకబడి లేరు. అంటే అభివృద్ధికి ఇంగ్లీషుకు సంబంధం లేదు. ఆ ప్రాథమిక విద్య ఏ మాధ్యమంలో నేర్చుకుంటున్నాము అనేది నేరుగా మన అవగాహనాస్థాయిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నది. ప్రాథమికమైన శబ్దజాలం మొత్తం ఆ స్థాయిలోనే పరిచయం అవుతున్నది. ఇక విజ్ఞానశాస్త్రాలు ఆరవ తరగతి నుండి దేనికది వేరువేరుగా ప్రత్యేకతను పొందుతున్నాయి. అప్పటికే వాటి ప్రాథమిక పదజాలం పిల్లవాడికి అలవాటుపడాలి. 

మన పాఠశాలల్లో తెలుగు మాధ్యమంగా చదువుకుంటున్న పిల్లలకు త్రిభాషా సూత్రం ప్రకారం మాతృభాష అయిన తెలుగుతో బాటు జాతీయ, అంతర్జాతీయ భాషలైన హిందీ, ఇంగ్లీషు భాషలను కూడా నేర్చుకోవాలి. ఒక్క హైదరాబాదులో తప్ప హిందీ త్వరగా అర్థం కానిదే. జాతీయభాష అయిన హిందీలో 20 మార్కులకు ఉత్తీర్ణత కాగా, అంతర్జాతీయ భాష ఇంగ్లీషుకు 35 మార్కులకు అర్హత. అంటే మన జాతీయత కంటే అంతర్జాతీయతకే ఉత్తమార్హత. 

తక్కువ మార్కులే కదా అన్న భావనతో హిందీ నిర్లక్ష్యానికి గురౌతే, ఇంగ్లీషుభాష పట్ల తల్లిదండ్రులకు, పాలకులకు ఉన్న మమకారం 'అయోమాయాకారాలకు' (విద్యార్థులకు అయ: ఉక్కు, తల్లిదండ్రులకు మాయ) గురి చేస్తున్నది. . 

ఇక మాతృభాష తెలుగు పరిస్థితి. పద్యభాగం అంటేనే ఒకవిధమైన జడపదార్థం చాలామందికి. అందులోనూ యూనివర్సిటీ స్థాయిలోనే ఒక పేపరుకు మిగిలిపోయిన పద్యం, ఆ స్థాయిలో చదివి పండితుడైన అధ్యాయుడు ఎలా ముందు పడతారు? అందుకే ప్రక్రియా పరిచయమనే పేరుతో పదవ తరగతిలో 15 మార్కుల స్థాయికి పడిపోయింది. గద్యంలో ఇరవై ఏండ్ల కింద, ప్రతి తరగతిలోనూ - పరవస్తు చిన్నయసూరి, వీరేశలింగం పంతులుగార్ల మిత్రలాభ, మిత్రభేదాదుల కథలు, చదువుకున్నాం. అటువంటిదిపుడు 7,9 తరగతులలో 4,5 పేరా కథల స్థాయికి కుదించుకుపోయింది. మిగతా అంతా వివిధ ప్రక్రియలు. 

పాఠ్యనిర్ణేతలకు ఒక అభిప్రాయం ఉండటం వల్లే ఈ ప్రక్రియా పరిచయాలను పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. అది... ఇంటర్‌ నుంచి విద్యార్థులు ఎలాగూ రెండవభాషగా తెలుగు తప్ప ఏదైనా తీసుకుంటారు కాబట్టిన్నీ, ఆపై ఇంకా పూర్తిగా సున్నాయే కాబట్టిన్నీ, తప్పనిసరి అయిన పాఠశాల స్థాయిలోనే అన్ని ప్రక్రియలను రుద్దేద్దామని కావచ్చు. ఫలితంగా ప్రక్రియా విశ్లేషణ, భేదాలు, ఉన్న ఆ కాస్త పదిలైన్ల పాఠం చెప్పటం ఇలా మొత్తం అసమగ్రమే. ఒక్క నానీలు, హైకూలు తప్ప అంతా వచ్చినట్లే ఉంది. 

సరే ఇలా తవ్వుకుంటూ వెళ్తే ఎంతయినా తక్కువే కాబట్టి “తెలుగు మాధ్యమం” అనే పదం ప్రధానంగా, వినిమయంలోకి వచ్చే గణిత, సామాన్య, సాంఘిక శాస్త్రాలలో తెలుగును స్పృశిద్దాం. 

చరిత్రకాలం నుంచీ కూడా మనం శాస్త్రాలూ, పరిభాషా సంస్కృత మాధ్యమంగానే అధ్యయనం చేస్తున్నాం. పరిభాషలో ఉపయోగించడానికి కారణం దాని 'సూక్ష్మతా'. గుణమే. 'నిర్వచనం'గానే విషయాన్ని చెప్పే ఆనుకూల్యం దాంట్లో ఉంది. " 

ఉదాహరణకు - వరుసలో మొదటిదైన గణితాన్ని గమనిద్దాం. మిశ్రమావర్తిత దశాంశం (మిశ్రమ - ఆవర్తిత - దశ - అంశం), చతుర్భుజం (నాలుగు భుజములు కలది) బహుభుజి, పరిధి (చుట్టుకొలత), వైశాల్యం, వ్యాసార్థం, లంబ సమద్విఖండన రేఖ, పరివృత్తం, అనులోమ విలోమ - అనుపాతం, తిర్యగ్రేఖ, సమీకరణం, సదృశకోణం, సాపేక్షవేగం, భాజకం, గుణిజం, కనిష్ట సామాన్య గుణిజం, వ్యవస్థితం, ప్రతిక్షేపించటం, ఆసన్నభుజం, ఇలా చూస్తూపోతే పూర్తిగా సంస్కృతమే. 

అసలు ఉదాహరణకు లంబ సమద్విఖండన రేఖను తీసుకుంటే లంబంగా ఉంటూ, సమంగా ద్వి(రెండు) ఖండాలు (భాగాలు). చేసే రేఖ అని వివరణ. ఈ సమాసంలో అర్థంకాని పదం లేదు. కాని విద్యార్థిని ఈ రేఖను గీయమంటే “సగం కంటే ఎక్కువ తీసుకోవాలా?” అని అనుమానం వెలిబుచ్చుతూ వృత్తలేఖిని తీసుకుంటాడు. అంటే దానర్ధం అతనికి ఆ పదానికి గల అర్ధం, చేస్తున్న క్రియకు సంబంధం లేకుండా పోతున్నది. నిజం చెప్పాలంటే ఆ పదాన్ని అతడు అట్లే Accept (అంగీకారం) చేస్తున్నాడు. సరిగ్గా ఎలాగయితే అర్థంకాని ఇతర భాషాపదాన్ని, తప్పనిసరి పరిస్థితుల్లో Accept (అంగీకారం) చేస్తున్నాడో అలాగే. 

మరిమనం 60-70% తెలుగుపదాలు సంస్కృతానివే 'అంటున్నామే! మరి దానితో ఏమైనా ఉపయోగం ఉందా? అనుమానమే. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు తలెత్తుతున్నది? కారణం విస్పష్టమే. పద్యాన్ని సాహిత్యం నుండి 'తరిమేస్తున్నట్టు' లేదా పద్యం నుండి 'తప్పించుకుంటున్నట్టు' గానే భాషలోని సంస్కృతాన్ని విడిచి పెడున్నాం. దీనర్థం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అర్థం చేయించాలంటే సంస్కృతంలో పాండిత్యం అవసరమని కాదు. కనీసం ఆదివృద్ధులు, ఉపసర్గలు మొదలైనవాటి ఉపయోగం తెలిసి ఉండటం. ఉపాధ్యాయుడే ఈ పరిభాషాపదాల్ని అలాగే ఉన్నది ఉన్నట్టుగానే Accept (అంగీకారం) చేస్తే మరి విద్యార్థి పరిస్థితి? 

సామాన్యశాస్త్రంలో ఉష్ణోగ్రత (ఉష్ణము యొక్క ఉగ్రత) - భాష్పోత్సేకము, మస్తిష్కము - అనుమస్తిష్కము, అనాచ్ఛాదిత, పరిధీయ, స్వయంచోదిత నాడీవ్యవస్థ, విసరణ, ద్రవాభిసరణ, -ద్రవోద్దమము, అండోత్సర్గము, పుష్పాసనం, పుష్పవృంతం, జ్ఞాన ఇంద్రియాలు, జ్ఞాన నాడి (అభివాహినాడి), చాలకనాడి (అపవాహినాడి), ఇలా ఎన్నో. ఉదాహరణకు విసరణ, ద్రవాభిసరణ అనే పదాలు తీసుకుంటే - విసరణ : సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశం నుండి తక్కువ సాంద్రత గల ప్రాంతానికి అణువులు సరించడం లేదా కదలటం. అదే ద్రవాభిసరణ (ద్రవ - అభి - సరణ). అంటే ద్రవమునకు - అభిముఖముగా (సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంవైపు ఎదురుగా). అణువు కదలటం. ఇట్లాగే. అండోత్సర్గము (అండ-ఉత్-సర్గము). పుష్పాసనం (పుష్ప-ఆసనం), ఇలా అర్థం చేసుకోవచ్చు. కాని భాషను విషయాన్ని వేరుచేసి, తెలిసిన భాషే కదా అనే చులకన భావం ఉన్న నేటి (సంధిసూత్రం తెలిసినంత మాత్రానే పండితుడనేయడం లేదా పండితుడే సంధిసమాసాలు చెప్పాలనే) పరిస్థితుల్లో విషయాన్ని మాత్రం ఎలా బోధించగలం?

ఇక సాంఘికశాస్త్రంలో చాలావరకు ఈ పరిభాష పరిభాషలాగ - అనిపించకుండా సహజంగా అర్థమవుతుంది. కొన్నిచోట్ల మాత్రం హిమాచ్చాదిత మండలం (మంచుతో కప్పబడే ప్రాంతం) మత్స్యగ్రహణం (చేపలు పట్టుట), పశుచారణం (మాంసం కోసం పశువుల్ని పెంచటం), ఇలాంటివి (మాతృభాషావాదులను రైలుకు బదులు ధూమశకటం అని వాడండి అని వెక్కిరించినట్టుగా) కృతకంగా కనిపిస్తాయి. ఇలా అవసరం లేనివి తగ్గించవచ్చు. 

ఎనిమిదవ తరగతి సాంఘికశాస్త్రంలో ఒక ఉపపాఠం - “1857లో తిరుగుబాటు, గమనము-స్వభావము”. దీనిలోని 'గమనము' అంటే ఏమిటి? బాగా పరిచితమైన వ్యాప్తి అనే కదా! ఇక్కడ 'గమనం' కృతకమే కదా. ట్రూ ట్రాన్స్లేషన్లో వచ్చిన ఇబ్బంది ఇది. అదే ఇంగ్లీషు ఛాయలాగే అనిపించే "అలీనోద్యమం (ఏ కూటమిలోనూ లీనం కాకుండా ఉద్యమించటం) అర్థంలో ఎంత స్వచ్ఛంగా ఉందో. 

ఇలాగే భౌతిక రసాయన శాస్త్రాల్లో - దృగ్గోచర, క్షయకరణ, ఆక్సీకరణం (ఇంగ్లీషు ఛాయ), అయానికిక బంధం (ఇం. ఛా) వ్యుత్తమం, స్వచ్ఛంద ఉద్గారం, త్వరణం, గురుత్వాకర్షణ బలం, అణువు - వరమాణువు, విశిష్ట - ఉష్ణం మొదలైనవెన్నో, ఇంగ్లీషులోని Molecule, Atom లుగా వేరు వేరు రూపాలలో కనిపించేవి. 'తెలుగులో ఎంత సహజంగా అణువు, పరమ (నిజమైన - అసలైన) + అణువుగా అమరినాయో చూడండి. వాటి మధ్య సంబంధాన్ని గమనించండి. ఇంగ్లీషులో ఆ సంబంధం కనిపిస్తుందా? ఇంగ్లీషులో Heat & Temperature, Thermometre అనే పదాలకు సంబంధమూ లేదు, వ్యుత్పత్తి లేదు. ఉష్ణము (ఉష్ణశక్తి) ఉష్ణోగ్రతలు గమనించండి. ఉష్ణము అర్థమౌతే ఉష్ణోగ్రత పరిచయం కావడం ఎంత సులభం. ఉష్ణం యొక్క ఉగ్రత లేదా తీక్షణత. ఉష్ణరాశిని నేరుగా లెక్కించలేం. కాని దాని తీక్షణతను కొలవడానికి ఉష్ణమాపకాన్ని ఉపయోగించి ఉష్ణము యొక్క ఉగ్రతను కొలవగలం. అదే 'అయోమాయాకారాన్ని కలిగిస్తున్న ఇంగ్లీషు' లోని Heat, Temperature ల మధ్య సంబంధాన్ని తీసుకురాగలుగుతారా, పదాలు వేరే. వాటి భావాలూ వేరే. (Temperature కు బదులు Hotness లేదా Coldness లు వాడాలి. Heat బదులు Thermal energy అని వాడితేనే Thermometre అర్థమౌతుంది.) అదే ఉష్ణ ఉష్ణోగ్రత, ఉష్ణమాపకాల్లో ఉష్ణభావన లేదా ఉష్ణోగ్రత భావన ఉంది చాలు మిగతా రెంటినీ అవగాహన చేయించవచ్చు. 

Resistence పదం యొక్క అర్థం ఆపడం, పని చేయనివ్వపోవడం General English లో కాని అదే Electricity Chapter - లో... దానిని వేరే పదంగా Accept లేదా Receive చేసుకుంటున్నాడు - ఆ మాధ్యమంలోని విద్యార్థి. అంటే ఆ మీడియంలో కూడా Language ను Subject ను వేరు చేసి చూస్తున్నారని అర్థమౌతుంది. ఈ మనమనుకునే గొప్ప Mediumలో తెలుగు మాధ్యమం కన్నా పరిస్థితులు వేరుగా ఉన్నాయా?

జ్ఞానము (పదజాలం), అవగాహన (భావం)ల మధ్య సంస్కృతాన్ని ఉపయోగించి నేరుగా సంబంధం తీసుకురావచ్చు. Knowledge Name) - Understanding (Concept) ఇవి విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రపదాలు. కాబట్టి ఈ Activity ల మధ్య సంబంధాన్ని సంస్కృత పరిభాష మాత్రమే నేరుగా ఏర్పరచగలదని సూటిగా ఒప్పుకోవచ్చు. ) 

ఇంతా ఆలోచించిన తర్వాత అనుమానం వస్తున్నది. మనం సంస్కృత మాధ్యమంలో చదవడం లేదుకదా అని. కాని సంస్కృతంతో గల "అవినాభావ సంబంధం”వల్ల ఇది తప్పనిసరి పరిస్థితి. దీనినుండి బయటపడేదెలా? కష్టం. తెలుగులో  వివరణ ఇవ్వగలం కాని “ఒక్క పదంలో భావాన్ని” ఇముడ్చలేం. కాబట్టి సంస్కృత సహాయం తప్పనిసరి. సహజమైన మూలరూపం (లేదనుకోండి) ఇంగ్లీషులో కూడా ఈ అవకాశం తక్కువే.

మనభాషలో 60-70% వరకూ సంస్కృతాన్ని ఇముడ్చుకున్నాం కాబట్టి ఆలోచిస్తే సులభమే, ఆచరణ సాధ్యమే. పరిశోధనా స్థాయి వరకు కూడా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించడమూ సాధ్యమే (ఇంగ్లీషు దొరల కోసం పరిశోధనలు అనుకుంటే తప్ప). కావలసిందల్లా ఎప్పటికప్పుడు మారుతున్న / వస్తున్న విజ్ఞానశాస్త్ర పదాలకు పరిభాషలు తయారు చేసుకోవడమే. అపుడే పరిశోధనారంగంలోనూ మనదైన ముద్ర వేయగలము. లేకపోతే బయటివాళ్ళు కనిపెట్టిన దానికి మేకప్ వేసి విస్తరింపచేయడానికి మాత్రమే పరిమితమౌతాం. (ఇపుడు కంప్యూటర్ రంగంలో జరుగుతున్నది అదే. Technology కి మూలమైన Binary concept, Dos, Hardware మొదలైన మౌలికమైనవన్నీ మనం కనుక్కున్నవి కావు. వాటిని ఉపయోగించి మన కుశలతతో 'సేవారంగం'లో పావులమైనాము. భావదాస్యం నుండి ఉద్యోగదాస్యానికి మారుతున్నాము. నెలకు 30వేల పైన సంపాదిస్తున్నా డాలర్ల లెక్కలో పైసలమే కదా. విజ్ఞానశాస్త్రాలలో మూలాలకు చొచ్చుకుపోలేకపోతే సెకండరీ (ద్వితీయ శ్రేణి) స్థాయిలోనే మిగిలిపోతాం . 

కాని మనకు స్వాభావికమైన మాధ్యమమేది అనే ప్రశ్న వేసుకుంటే ఇప్పటి పాఠశాలకు వెళ్తున్న తరానికి (ఇది అది అని ఏ మాధ్యమంలో కూడా తేడా లేదు), సంస్కృతం ఎంత అర్థమౌతుందో, ఇంగ్లీషు అంతే అర్థమౌతుంది. ఇంగ్లీషు ఎంత అర్థం కావడంలేదో సంస్కృతమూ అంతే అర్థం కావడం లేదు. 

ఎందుకీ పరిస్థితి దాపురించింది. బడి, నీరు, నూనె, కష్టం, సులభం, అమ్మా, నాన్న, ఉదయం, ఆం, ఒకటిన్నర, నాలుగు గంటలకు, చదువు, పాఠం, బల్ల, ఏ, పిల్లి, కుక్క ఇలా అన్నీ School, Temple, Water, td, Easy, Mummy, Daddy, Morning, Evening, Irty, Four 'O'clock, study, Lesson, Table, Chair, cat, Dogగా మారిపోయాయి (కాదు మారిపోయాము). తెలుగు పదాలు, తెలుగులో వున్న స్వాభావిక పదాలకే ఈ గుడి, నీరు, నూనె, సాయంత్రం, ఒకటిన్ కుర్చీ, చేప, పిల్లి, కు Oil, Hard, Easy, M One thirty, Four Firsh, cat, Dog ఇవన్నీ తెలుగు పదాలు 

గతి పడితే సంస్కృత పదాలు కొత్తగా చేరతాయా? రోజూ ఉపయోగించే పదాలు ఇలా మారిపోతే మనసు స్థితిగతుల్ని వివరించే కొత్త పదాలు విద్యార్థి డిక్షనరీ (పద భండాగారం)లో చేరగల్గుతాయా? అపుడు కొన్నాళ్ళకు ఒక తెలుగు/ సంస్కృత పదం నేర్చుకునే కంటే ఇంగ్లీషుపదం నేర్పడమే సులభమవుతుంది. ఇది నిజంగా బాధాకరం. (మాకు తెల్సిన కుటుంబంలోని పిల్లవాడిని ఒక 'బొమ్మ చూపించి ఇదేంటి అంటే Fish అన్నాడు తడుముకోకుండా. తెలుగులో...? అంటే - నిమిషం ఆలోచించి (పాపం. . . . మెదడు లోపలి పొరల్నుండి మనసుపొర వరకూ రావడానికి) చేప అన్నాడు. మరి అతనికి ముందు ముందు Fisheries అంటే తొందరగా అర్థమౌతుందా మత్స్యగ్రహణ శాఖ అంటేనా? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒకేమాట గట్టిగా చెప్పొచ్చు. రేవటితరం భారతపౌరులు కారు - అమెరికా బానిసలౌతారు. 

ఇప్పటికీ మించిపోయింది లేదు. తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేసి (భాష మాత్రమే కాదు తమిళనాడు, కేరళలలో లాగా మాధ్యమాన్ని). కేరళలో మాతృభాష ఏదైనా మళయాళం ప్రథమభాషగానే చదవాలి! మనదగ్గర II Languageఐనా పర్లేదు. అదృష్టం ఈ మధ్య - Special English పోటు తప్పింది. పరిభాషలోని కనీసమాత్రపు సంస్కృత వదజాలాన్ని వరిభాష అర్థం చేసుకునే విధంగా ఉపాధ్యాయులను తయారుచేస్తే పరిశోధనా స్థాయివరకు తెలుగును విస్తరింపచేయవచ్చు. ఇకనైనా మేలుకుంటే మంచిది. 

ఏ ప్రయత్నమైనాసరే ఒక నిరక్షరాన్యుడు కూడా ' టైమెంతయ్యిందంటే 4:20 అంటున్నాడు. అది తప్పితే చాలు. ఇంతవరకు మాధ్యమం లేదా పరిభాషపై మారుతున్న సమాజం 

ప్రభావం చర్చించడం జరిగింది. అయితే సమాజంలో మార్పుకు - కారణాలవుతున్న (భాషకు పరిమితమై) టి.వి. మీడియా, కార్పొరేట్ 

సంస్కృతి, తల్లిదండ్రుల ఆశలు, వారి తప్పనిసరి పరిస్థితులు, ఇరుగుపొరుగు వారి ప్రభావం ఇలా ఎన్నో అంశాలు ఈ సున్నితమైన మాధ్యమంను గురించి తల్లిదండ్రులను ఆలోచింపచేస్తున్నాయి. అంటే చదువుకోవాల్సిన విద్యార్థికి ప్రమేయం లేకుండానే అతని గురించిన నిర్ణయం, జరిగిపోతున్న వాతావరణం. మనం చర్చించింది. తెలుగు మాధ్యమంలో చేరిన విద్యార్థి, తెలుగు మాధ్యమంలో చెపుతున్న ఉపాధ్యాయుని పరిస్థితి.. ఈ చిన్న అంశమే కాదు తెలుగు మాధ్యమ - పరిభాషలో మార్చవలసిన అంశాలు, లేదా ఉన్నవాటికే పారిభాషిక పదకోశము, మొదలైనవి పైన పేర్కొన్న, మిగిలిన కారణాలు అన్నీ చర్చకు లోను కావల్సినవే. అంత 

మేధావులు, విద్యావేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు చర్చించి, 

తేల్చాల్సిన విషయాలు, అవకాశం వస్తే తప్పక చర్చించవలసిన అంశాలు. 

ఆఖరుగా ఎనిమిదవ తరగతిలో - "ప్రాణంతో ఉండే అన్ని జీవులు పరిసరాల మార్పులకు జ్ఞానేంద్రియాల సహాయంతో “అనుక్రియల"ను చూపుతాయి. ఆ లక్షణాన్ని 'క్షోభ్యత' అంటారు. 

జ్ఞానేంద్రియం ముఖ్య లక్షణం ఏమిటంటే అది ఒక ప్రత్యేకమైన గాఢత లేక బలం కలిగిన క్షోభ్యతలకు మాత్రమే స్పందిస్తుంది అని వివరణ. క్షోభ్యత (బాధ, తపన, వ్యతిరేకంగా లేదా అనుకూలంగా స్పందించటం 

దీనిపై ఆఖరు ప్రశ్న. 

జ్ఞానేంద్రియం (మనసుకూడా) తన ముఖ్య లక్షణాన్ని ప్రదర్శించకపోతే మరి ప్రాణం ఉన్నట్టా? లేనట్టా? జవాబు ఈ వ్యాసంలోని అంకెలను ఏ భాషలో చదివినారు అనే విషయంలో ఉంది. 

Comments

Popular posts from this blog

టీచర్

బాలల రామాయణం

అక్షరాల మురమురాలు (వాట్సాప్ స్టేటస్ సీరియల్ వ్యాసం)