సినిమా – మనసుపై ప్రభావం – మనోవిజ్ఞాన, అలంకార శాస్త్రాల పార్శ్వం
వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక విధంగా, పదిమందిలో ఉన్నప్పుడు ఇంకోవిధంగా ప్రవర్తిస్తాడు. అందుకు కారణాలనేకం. ఈ కారణాల విశ్లేషణ అతని మూర్తిమత్వ విశ్లేషణ కిందికి వస్తుంది. మనోవిజ్ఞానశాస్త్రంలో ఫ్రాయిడ్ మూర్తిమత్వ అంచనా కోసం మనోవిశ్లేషణ సిద్ధాంతం ముందుకు తెచ్చాడు. ప్రస్తుతం అధిక సంఖ్యాకులను ఇది ప్రభావితం చేస్తూంది. ఫ్రాయిడ్ మనస్సును మూడు రంగాలుగా విభజించాడు. ఈ మూడూ కలిసి వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపుతాయి. ఒక రకంగా ఈ మూడిటి సంఘర్షణలో మానవుని ప్రవర్తన అతని మూర్తిమత్వం తెలుపుతాయంటాడు అతను. ఆ మూడు అచిత్తు (ఇడ్), చిత్తు (ఇగో), అధ్యాత్మ (సూపర్ ఇగో). ప్రాచీన తత్త్వవేత్తలు కూడా మనసు, బుద్ధి, ఆత్మ లనే మూడు భావనలను తెలిపారు. మనసుపై బుద్ధి, బుద్ధిపై ఆత్మ తమ ప్రభావం చూపుతాయని, అలా పాజిటివ్ గా ప్రభావం చూపగలిగినపుడే మనిషి పరమాత్మ స్థాయికి చేరువకాగలుగుతాడని అన్నారు. మనసుని అదుపులో ఉంచుకోవడమంటే కోరికలను అదుపులో ఉంచుకోవడమని, మనసును అదుపులో పెట్టేది బుద్ధి అని, బుద్ధి క్రియాశీలతను నిర్ణయించేది ఆత్మ అని అన్నారు. ఇందుకు ఉదాహరణగా మనసు – రథం యొక్క గుర్రాలని, వాటికి పూన్చిన తాళ్ళే బుద్ధి అని, ఆ తాళ్ళు సారథి అద...