అక్షరాల మురమురాలు (వాట్సాప్ స్టేటస్ సీరియల్ వ్యాసం)

28/12/2023

రంగులు లేని‌ లోకం ఎలా ఉంటుంది?
బోసిగా, నిస్సారంగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా కదూ.
రంగులలో పసుపు నీలం ఎరుపు ప్రాథమిక రంగులు. 
అలాగే అచ్చులు లేని హల్లులు కూడా జీవం లేనివే. అచ్చుల్లో అ ఇ ఉ ఋ లు ప్రాథమికం.
ఎలాగో ముందు చూద్దాం.

29/12/2023
పసుపు నీలం తో ఆకుపచ్చని, ఎరుపు తో నారింజ రంగు, నీలం ఎరుపు తో జేగురు రంగులను ఇచ్చినట్లు;
అ ఇ లను ఒకేసారి వరుసగా పలికితే ఏ, అ ఉ లను పలికితే ఓ, అ ఋ లను పలికితే అర్ ను ఇస్తాయి. *ఏ, ఓ, అర్* లను *గుణములు* అంటాము.

29/12/2023
అ + ఇ = ఏ, అ + ఉ = ఓ, అ+ ఋ = అర్ ;
ఏ, ఓ అర్ లను పలుక గలిగితే
👍 పెట్టండి.

31/12/2023
ఇప్పటి వరకు అ,ఇ,ఉ,ఋ లతో పాటు ఆ,ఈ,ఊ,ౠ లకు కూడా ఇదే మెకానిజం వర్తిస్తుంది.‌ ఏ,ఓ, ఐ,ఔ అచ్చులు కూడా వచ్చేశాయి.
కాని ఎ,ఒ లు ఇంకా రాలేదు. కారణం...
ప్రస్తుతం మనం సంస్కృత భాషలో అచ్చుల గురించే మాట్లాడుకుంటున్నాం. 
ఎ,ఒ అచ్చులు తెలుగు భాషలో (ఇతర దక్షిణ భారత దేశ భాషలలో ) మాత్రమే కనిపిస్తాయి.

31/12/2023
ఇక ఌ, ౡ లు సాధారణ సంస్కత భాషలోనూ కనిపించవు. కేవలం వేదం లోనే కనిపిస్తాయి.
అ తో ఇ,ఉ,ఋ లు ఏ,ఓ, అర్ అనే గుణాలను ఏర్పరచగా అ ఌ తో కొత్త అచ్చును ఏర్పరచకపోవడం గమనించాలి.

01/01
1. అ ఇ ఉ ణ్
2. ఋ ఌ క్
3. ఏ ఓ జ్
4. ఐ ఔ చ్
ఈ వరస గమనించండి.
ఇవి మహేశ్వర సూత్రాలలో మొదటివి. ఈ నాలుగు సూత్రాలలో అచ్చులు అన్ని ఇమిడిపోయాయి.
 *మొదటి వరుసలో అ నుండి నాలుగో వరుసలో చ్ వరకు అచ్చులు*.
అ,ఇ,ఉ,ఋ,ఌ ల హ్రస్వ రూపాలే కనిపిస్తున్నాయి. కానీ ఆ,ఈ,ఊ,ౠ,ౡ దీర్ఘ రూపాలు లేవు. కారణం సూత్రాలు ఎంత తక్కువ అక్షరాలు పదాలలో చెప్పుకుంటే అంత సులభంగా ధారణ చేయవచ్చు.
మొత్తం 12 అచ్చులకు 12 గుణింతాలు. అందుకే హిందీలో గుణింతాలను బారాఖడీ అంటారు.
మరి అం, అః సంగతి ఏమిటి?

01/01
మరి అం, అః సంగతి ఏమిటి?
అం, అః లను *ఉభయాక్షరాలు* అంటారు.
అంటే ఈ రెంటినీ అటు అచ్చుల లోనూ, ఇటు హల్లుల లోనూ సందర్భాన్ని బట్టి వ్యవహరించవచ్చు.
అందుకే తెలుగు లో వీటిని కూడా గుణింతాలలో చేర్చుకున్నాము.

02/01
ఇక...
ఇ, ఉ, ఋ లతో ఏర్పడే అక్షరాలు ఉన్నాయా?
ఇంతకు ముందు *అ,ఇ* లు ఒకేసారి పలికితే *ఏ* వచ్చింది కదా.! 
ఇప్పుడు *ఇ,అ* లను ఒకేసారి పలకండి. ఏం గమనించారు?
అలాగే ఉ,అ; ఋ,అ జతలను కూడా ప్రయత్నించి చూడండి.
ఇవి అర్థం అయితే ...
ఇ,ఉ; ఇ,ఏ; ఇ,ఓ; ఇ,ఔ; ఉ,ఇ; ఉ,ఏ; ఉ,ఓ; ఉ,ఔ జతలను ప్రయత్నించండి.
తర్వాత చర్చిద్దాం.

02/01
*అ, ఇ* లను ఒకేసారి పలికితే *ఏ* వచ్చింది కదా.
మరి ...
 *ఇ, అ* లను పలికితే ఏం అయింది!? 
 *య* శబ్దం ఏర్పడింది కదా!
ఇలాగే
 *ఉ,అ లతో వ* ;
 *ఋ,అ లతో ర* 
వచ్చాయి కూడా.
ఈ *య,వ, ర* ల తో పాటు *ల* ఈ నాలుగింటిని *యణ్* (యణాదేశ సంధి)లు అంటారు.
ఎందుకో రేపు చూద్దాం.

05/01
కింది మాహేశ్వర సూత్రాలు చూడండి.
5. హ య వ ర ట్
6. ల ణ్
5 వ సూత్రం లోని *య* నుండి 6 వ సూత్రం లోని *ణ్* వరకు అంటే...
 *య,వ,ర, ల* ఈ నాలుగింటిని *యణ్* లు అంటారు (యణాదేశ సంధి).
👉 ఇంకొకటి...
ఈ య,వ,ర,ల నే " *అంతస్థాలు* " అంటారు.
అంటే... నోటి చివరి భాగం నుండి వెలువడే శబ్దాలు. జాగ్రత్తగా పలుకుతూ గమనించండి. 👍

05/01
 అవునూ!
ఇంతవరకు మనం గుణాలు ( *గుణసంధి* ), వృద్ధులు ( *వృద్ధి సంధి* ),
యణ్ లు ( *యణాదేశ సంధి* )
అని చెప్పుకున్నాం కదా.
👉 ఇంకొక ప్రముఖమైన సంధి జ్ఞాపకం వచ్చి ఉండాలే!!!
 *సవర్ణ దీర్ఘ సంధి* కదూ!
👉 అలాగే *అంతస్థాలు* అనుకున్నాం!
అంతస్థాలు అంటే నోటి చివరి నుండి పలికేవి అనుకున్నాం. అవి ఎలా పలుకుతున్నామో గమనించండి అన్నాను.
 *సవర్ణ దీర్ఘ సంధి, అంతస్థాలు గురించి* బాగా అర్థం కావాలంటే...
రేపు చర్చించుకుందాం. 👍

06/01
ఇంత వరకు అక్కడక్కడా *మాహేశ్వర సూత్రాలు* అని చెప్పుకున్నాం కదా!
👉 వాటిలో 5వ సూత్రం లోని *_హ_* , 14వ సూత్రం చివరి *_ల్_* మధ్యలో ఉన్న అక్షరాలనే మనం *_హల్లులు_* అంటున్నాం.
వాటి గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%B9%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0_%E0%B0%B8%E0%B1%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81#
👍
వాటి ప్రత్యేకత వ్యాకరణం లో ఏమిటనేది తెలుసుకోవాలి.
మన దేశ భాషలపై మరింత గౌరవం పెరుగుతుంది.
👍ఇక రేపు *అచ్చులు హల్లులు మధ్య* *మనం గమనించని _తేడా_* గురించి చెప్పుకుందాం. 👍

07/01
ఈ స్టేటస్ పరంపర మొదట్లో అచ్చులను రంగులతో, హల్లులను భౌతిక పదార్థాలతో పోల్చడం జరిగింది.
ఆకాశం అనగానే నీలం రంగు, తెలుపు రంగు పక్షి అనగానే హంస గుర్తుకు వస్తుంది. 
అలాగే ఎరుపు లోహం అనగానే రాగి పాత్ర, పసుపు అనగానే పండు లేదా బంగారం గుర్తుకు వస్తాయి.
అంటే రంగ భౌతిక పదార్థం రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి.

07/01 
ఇక అచ్చులు హల్లుల విషయానికి వస్తే అచ్చు చేర్చకుండా హల్లులు పలకలేం.
అదే హల్లుల సహాయం లేకున్నా అచ్చులు పలుకగలం. 
హల్లు ఒక శరీరం, అచ్చు దాని లో ఉండే ప్రాణం.

07/01
👉 ఇంకొంచెం జాగ్రత్తగా లోతుగా చూస్తే...
హల్లులు రంగును కలిగిన వంట దినుసులు. 
ఒక 
జిలకర పలుకు పంటి కిందికి వస్తే...
అదే మిరియం గింజ వస్తే...
అలాగే దాల్చినచెక్క ముక్క వస్తే...
అంటే మొత్తం మీద అచ్చులు రంగులే కాదు, ఆ గంధం అంటే ఘుమఘుమలు పాత్ర కూడా పోషిస్తున్నాయి అని చెప్పొచ్చు.

07/01 
ఇక అచ్చుల హల్లుల తేడా విషయానికి వద్దాం.
అచ్చులు, హల్లులు పలికే సమయంలో నోటిలో వివిధ భాగాలు ఎలా మసలుకుంటున్నాయో గమనించండి.
జాగ్రత్తగా గమనిస్తే...
👉అచ్చులు పలికే వేళ నోటిలోని ఏ భాగమూ ఇంకో ఏ భాగాన్నీ తగులదు.
👉హల్లులు పలికే సమయంలో ఏదో ఒక భాగం ఇంకోదానికి తగులుతుంది.
👋 ఏ శబ్దం ఏ ప్రయత్నం వల్ల వస్తుందో గమనించండి.
తర్వాత చర్చిద్దాం…

06/01/24
 అచ్చులు హల్లులు ఒక్కో అక్షరం గమనిస్తూ పలికారు అనుకుంటా. ఏయే అక్షరం ఏయే భాగాల వల్ల ఏం జరిగితే ఏర్పడుతున్నాయి? మళ్ళీ గమనించండి.
👉ఇక అచ్చుల్లో అ ఇ ఉ ఋ లు ప్రాథమికం అని, ఏ ఓ లు గుణాలని, ఐ ఔ లు వృద్ధులు అని చెప్పడం జరిగింది.

07/01/24
👉 అంటే... ఏ ఓ ఐ ఔ లు స్వతహాగా ఉండవని కాదు. ఏడులో ఏ కోసం ప్రత్యేకంగా అ ఇ లను మనసులో అనుకుని ప్రయత్నం చేయం.
👉 ఏ ఓ లు అ ఇ, అ ఉ ల ఉమ్మడి ప్రయత్నం చేసినట్టు ఉంటుందనే ఉద్దేశం. అలాగే ఐ ఔ లు కూడా.
👉 అ ఇ లు రెండింటి లక్షణం ఏ లో ఉందని.
ఇలాగే మిగతావి.
ఒక్కసారి...
కకాకికీ... గుణింతం లాగా అ గుణింతం, ఇ గుణింతం చదువండి చూద్దాం 😀😀😀

08/01/24 
👉మనలో చాలా మందికి గుణసంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి పదాలు చిన్నప్పటి నుండి తెలుసు.
👉 ఆ సంధులకు ఆయా పేర్లు ఎలా వచ్చాయో తెలపడమే ఉద్దేశం. వ్యాకరణం చెప్పడం కాదు అని గమనించండి. 😇
👉 మన అక్షరాలు వర్ణమాల లో వాటి స్థానాల గురించి చర్చించడమే అసలు ఉద్దేశం.

09/01, 7:33  
ఉ ఊ
ప ఫ బ భ మ
లను పలకండి.
నోటి లోని ఏ ఏ భాగాలు తాకితే లేదా కదిలితే ఇవి ఏర్పడుతున్నాయి?
పెదాలతో కదూ!
 👉*ఉ ఊ లకు ముద్దు* పెట్టినట్టు 😀 పెదాలు ముందుకొచ్చాయి కానీ తగల్లేదు.
👉మరి *పఫబభమ గుణింతాలు?* అన్నిటికీ పెదాలు తగిలాయి.
💐రేపు ఇంకోటి 👋

10/01/24 
ఈరోజు
ఋ ౠ
టఠడఢణ 
పై దృష్టి పెట్టి పలకండి.
👉ఋ,ౠ లను నాలుక ఎక్కడా తగలకుండా పలకాలి. తగిలితే రురూ అయిపోతాయి జాగ్రత్త. 🤔
👉అలాగే టఠడఢణ గుణింతాలు పలికినా నాలుక పైకే తిరిగి పైన తగులుతున్నాయి కదూ.👍
💐 రేపు ఇంకోటి 👋

11/01/24 
ఈరోజు
 *ఌ ౡ
తథదధన* పై దృష్టి పెట్టండి.
 *ఌౡ* లను నాలుక ఎక్కడా తగలకుండా పలకాలి. *తగిలితే లులూ* అయిపోతాయి జాగ్రత్త. 🙃
👉 అలాగే *తథదధన*లు ఇంకా వాటి గుణింతాలు పలికినా నాలుక *పైవరస ముందు పళ్ళ వెనుక భాగంలో* తగులుతున్నాయి కదూ. 
అలా అయితే మీకు 👍
💐రేపు ఇంకోటి 👋

ఇంతకూ...
ఇవన్నీ మీరు...
అమ్మానాన్న ఐతే మీ పిల్లలతోటీ,
మేనత్త, మేనమామ ఐతే మేనల్లుడు మేనకోడలి చేత,
తాత అమ్మమ్మ నాన్నమ్మ ఐతే మనుమళ్ళు మనుమరాళ్ళ తో,
టీచర్ ఐతే మీ విద్యార్థుల తోనీ
పలికిస్తూ ఉన్నారా లేదా
మీలాగే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తెలుసుకుంటారు కదా!

12/01/24
ఇక 
*అ ఆ
కఖగఘ ౙ* 
పలకండి.
👉 *అఆ* లకు *నాలుక వెనుక భాగం కొంచెం పైకి లేచి ఎక్కడా తగలకుండా* ఉంది.
👉అదే *కఖగఘ ౙ* లకు *నాలుక వెనుక భాగం కొండనాలుక భాగం లో* తగిలింది కదా! 👍
👉 అలాగే *కఖగఘ ౙ గుణింతాల*కోసం కూడా నాలుక పైకి తగులుతుంది.
ౙ ను అజ్ఞ అని చిన్నప్పుడు టీచర్ చెప్పేదేమో! అప్పుడు పలకడం రాదని చెప్పి ఉంటారు. ఇక అలా పలకకండేఁ. అది చిన్నబుచ్చుకుంటుంది. సరేనా.🙂
👉 *ౙ గుణింతం* పలికారా! 😇 ఏదో వాయిద్యం వాయించిన శబ్దం కదూ 😀
💐 రేపు ఇంకోటి 👍😇

13/1/24 7:30AM
ఈరోజు
ఇ ఈ
చఛజఝ ఇ+ ల సంగతి చూద్దాం.
👉ఇఈ లకు నాలుక కొంచెం వెనక్కి జరిగి వెడల్పు అయి పక్క దంతాలకు లేదా దవడలకు తగిలీ తగలకుండా ఉంటుంది. 
👉అలాగే చఛజఝ లకు తగులుతుంది. జాగ్రత్తగా గమనించాలి. అలాగే వీటి గుణింతాలు పలికినా అంతే.
👉ఇ+ ని చిన్నప్పుడు టీచర్ లేదా పెద్దవాళ్ళు ఇణి అని చెప్పి ఉంటారు. ఆ వయసులో పలకలేం కాబట్టి ఓకే. ఇప్పుడు మార్చుకోవాలి కదా! దీని గుణింతం పలికారా!? ఎలా ఉంది? వీణ మీటినట్టుంది కదూ! 👍
💐 ఇంకా ఆసక్తి కలిగించే విషయం రేపు 🙂👍

14/1/24 7:30AM
సరే! విషయం బాగుంది. 
కానీ అఆ ఇఈ లాగా కఖగఘ చఛజఝ ఇలా వరుసగా చెప్పుకోవచ్చుగా అనే సందేహం రావాలే!
ముందు చెప్పుకున్న పఫబభమ కంటే ఆఖర్లోని చఛజఝ పలుకడం అర్థం చేసుకోవాలంటే క్లిష్టత (కాంప్లెక్సిటీ) పెరుగుతూ ఉంది. అందుకే ఉఊ పఫబభమ తో మొదలు పెట్టింది.
ఇక్కడ ఉద్దేశం ఏ శబ్దం ఎక్కడ ఏవిధంగా పుడుతుందో తెలియచెప్పడమే. అక్షరాలు నేర్పించడం కాదుగా!
💐రేపు ఇక అసలు విషయం... 👋

15/1/24 7:30
*సిద్ధాంత కౌముది* అనే గ్రంథాన్ని రచించిన *దీక్షిత పండితులు* కింది సూత్రాలను అందించారు.
1. అకుహవిసర్జనీయానాం కంఠః
2. ఇచుయశానాం తాలుః
3. ఋటురషాణాం మూర్ధాః
4. ఌతులసానాం దన్త్యాః
5. ఉపూపధ్మానీయానాం ఔష్ఠౌ
☝️ఈ సూత్రాలను అనుసరిస్తే చాలు ...
అక్షరాలు అనే అడవిలో సులభంగా దూసుకుపోవచ్చు.
ఒక్కో సూత్రం గురించి వివరంగా తెలుసుకుందాం.

16/1/24 
మొదటి సూత్రం 
1. అకుహవిసర్జనీయానాం కంఠః
దీనిలోని అక్షరాలు ఇలా…
అ - అ,ఆ - నాలుక వెనుక భాగం పైకి లేవడం.
కు - క,ఖ,గ,ఘ,ౙ - నాలుక వెనుక భాగం పైకి తగలడం.
హ - హ - నాలుక వెనుక భాగం పైకి లేచినా తగలకుండా ఖాళీ నుండి గాలిని వేగంగా బయటికి తోయడం.
విసర్జనీయః - ః - క కు ముందు వచ్చే విసర్గ. (మామూలుగా శ్లోకాలలో చూస్తుంటాం) 
అందుకే వీటిని కంఠ్యాలు అంటారు.

17/1/24
ఇక…
2. ఇచుయశానాం తాలుః (దవడ)
దీనిలోని…
ఇ,ఈ - నాలుక వెడల్పు అయి పక్క దంతాలకు లేదా దవడలకు తగలకుండా పలకాలి.
చు - చ,ఛ,జ,ఝ,ఇ+ - నాలుక వెడల్పు అయి పక్క దంతాలకు లేదా దవడలకు తగిలేలా పలకాలి.
య - పై దంతాలకు లేదా దవడలకు నాలుక తగులుతూ ముందు వైపు ఖాళీ నుండి ధ్వని వెలువడేలా పలకాలి.
శ - *య* లాగే నాలుక ముందు ఖాళీ నుండి వేగంగా గాలి బయటకు తోయడం ద్వారా శబ్దం వస్తుంది.

18/1/24
ఇక మూడోది…
3. ఋటురషాణాం మూర్ధాః (అంగిలి)
ఋ,ౠ - నాలుక పైకి తిరిగి అంగిలిని తగలకుండా కంపించడం.
టు - ట,ఠ,డ,ఢ,ణ నాలుక పైకి తిరిగి అంగిలిని టక్, టక్ అని తగులుతుంది.😊
ర - నాలుక పైకి తిరిగి అంగిలిని తగిలీ తగలకుండా కంపిస్తూ శబ్దం ఏర్పడుతుంది.
ష - నాలుక పైకి తిరిగి అంగిలిని తగలకుండా ఆ చిన్న ఖాళీ నుండి వేగంగా గాలి బయటకు తోయడం ద్వారా శబ్దం వస్తుంది.

19/1/24
ఇక…
4. ఌతులసానాం దన్త్యాః(దంతాల చిగుళ్ళు)
దీంట్లో…
ఌ,ౡ - నాలుక ముందు భాగం పై దంతాల చిగుళ్ళు తగలకుండా పలకాలి.
తు - త,థ,ద,ధ,న - నాలుక ముందు భాగం పై దంతాల చిగుళ్ళు తగలుతూ పలకాలి.
ల - తథదధన లాగే “అయితే” పూర్తిగా తగలకుండానే వేరవుతూ శబ్దం వస్తుంది.
స - పై పక్క దంతాలకు తగిలినా వేగంగా గాలి బయటకు వస్తూ గాలి ముందు దంతాల చిగుళ్ళకు తగులుతుంది. అందుకే ఇక్కడ చేర్చారు.

20/1/24
ఇక ఆఖరిది…
5. ఉపూపధ్మానీయానాం ఔష్ఠౌ
దీంట్లో…
ఉ, ఊ - పెదాలు ముందుకు సాగినా కలవకుండా పలికేవి. అయితే లోపల నాలుక లోపలివైపు ముడుచుకోవడం గమనించవచ్చు.
పు - ప,ఫ,బ,భ,మ - నాలుక ముందు భాగం ముందు వరుస దంతాల చిగుళ్ళు తాకుతూ పలికేవి.
ఉపధ్మానీయం - ప కు ముందు వచ్చే విసర్గ. శ్లోకాలలో చూస్తుంటాం.
🙂 దీంతో అయిపోలేదు. అక్షరాల గురించి చెప్పుకోవాల్సింది ఇంకా మిగిలే ఉంది. 👋


21/1/24
ఇప్పటిదాకా దీక్షిత పండితుల సూత్రాలు చూసాము.
ముందు చెప్పుకున్న మాహేశ్వర సూత్రాల లోని హల్లుల లో ఒక వరుస కనిపించదు. 
కానీ ఈ సూత్రాలలో చూస్తే మొదలు క,చ,ట,త,ప అనే వర్గాలు (గొంతు నుండి పెదాల వరకు) గమనిస్తాం. వర్ణమాలలో కూడా ఇదే వరుస చూడవచ్చు.
👉అయితే అచ్చుల్లో చూడండి. ఉ,ఊ ఇఈ తర్వాతే వస్తాయి. కారణం ఋౠ, ఌౡ లు *వృద్ధులు* ఏర్పరచకపోవడం.
💐 సశేషం👍

22/1/24
ఈరోజు నిన్న అనుకున్న వృద్ధులతో రాముల వారికి అక్షరసుమాలు.
👉కింది జంట పదాలలో మొదటి అక్షరాలు చూడండి. వృద్ధుల(ఆ,ఐ,ఔ) ఉపయోగం తెలుస్తుంది.
దశరథుడు - దాశరథి
రఘువు - రాఘవుడు
జనకుడు - జానకి
మిథిల - మైథిలి 
సుమిత్ర - సౌమిత్రి (లక్ష్మణుడు)
అంజన - ఆంజనేయుడు
🙏అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. జైశ్రీరామ్.🙏

23/1/24
ఇంతదనుక😊
వర్ణమాలలో హల్లులు క నుండి హ వరకు చూసాం.
💐ఇక య(వ)రల ల గురించి ఇంతకుముందే అంతస్థాలనీ, నోటి చివరి భాగంలో వివిధ భాగాలు, ప్రాంతాల్లో శబ్దం ఎలా ఏర్పడుతుందో కూడా తెలుసుకున్నాం. (వ) గురించి రేపు తెలుసుకుందాం.
అంతే కాకుండా…
💐శషసహల గురించి. వీటిని ఎలా పలుకుతున్నామో తెలుసుకున్నాం కూడా.
ఇవి బలంగా గాలిని బయటకు తోస్తూ పలుకుతాం కాబట్టి ఊష్మాలు అంటారు.

24/1/24
నిన్న వ మిగిలింది కదా!
👉 వ కోసం ముందు వరుస దంతాలు పెదాలను తగులుతాయి. అందుకే పూర్తిగా దంత్యం అనడానికి లేదు. నోటి చివరి భాగం నుండి వస్తుంది కాబట్టి ఇది కూడా అంత్యమే.
🤔 అన్ని వర్ణమాల అక్షరాలు అయిపొయాయా?🧐
👉ఇంకా క్ష,ళ,ఱ మిగిలాయి కదా!😃 అవును. అవి తెలుగు వర్ణమాలలోనివి.
👉అదే సమయంలో క్ష,త్ర,జ్ఞ హిందీ లో చూస్తాం.
మొదట సంస్కృత వర్ణమాల. 
💐 రేపు తెలుసుకుందాం👍

25/1/25
సంస్కృత/ హిందీ(ఉత్తర దేశ) భాషలలో క్ష,త్ర,జ్ఞ గురించి చూద్దాం.
ఇవి మూడూ సంయుక్తాక్షరాలే. అంటే ఒక హల్లుతో ఇంకో హల్లు కలిసి ఇంకో కొత్త రూపం ఏర్పడడం.
అయితే…
వీటిని అ,ఇ లాగా అ,ఉ లలాగా రెండు అక్షరాలు ఒకేసారి కాకుండా మొదటి హల్లు పొల్లుగా పలికి వెంటనే రెండో హల్లు గుణింతం తో సహా పలుకుతాం. (కల్కి ని కల్,కి అని వ్యవధానం లేకుండా)
💐రేపు క్ష,ళ,ఱ గురించి…👍

26/1/24
క్ష,ళ,ఱ గురించి…
👉క్ష సంస్కృతంలోనూ తెలుగులోనూ సంయుక్తాక్షరమే. క మరియు ష కోసం జరిగే రెండు పనులు ఒకదాని వెంట ఒకటి జరగడం చూడవచ్చు.
👉ఇక ళ దక్షిణ దేశ భాషలలో అలాగే మరాఠీ భాషలోనూ చూస్తాం. నాలుక పైకి తగులుతూ ముందు వైపు జారుతూ దంతాలను తగులుతుంది. 
👉 ఱ,ౘ,ౙ లు అక్షరమాలలో బాక్సుల్లో భద్రం చేసుకున్నాం. పక్క దవడలకు, పై దంతాల వెనుక ఒకేసారి నాలుక తగులుతుంది.
👍👋👋

27/1/24
👉ళ గురించి మరికొంత…
ఈ మధ్య ళ ను ల గా పలకడం చూస్తుంటే ళ కు కూడా బాక్స్ కట్టెయ్యాలేమో! కళ్ళు అనడానికి కల్లు అని, పెళ్ళి అనడానికి పెల్లి అని పలికితే ఎంత చిరాగ్గా ఉంటుంది!?
అలాగే వాల్లు, వీల్లు. కనీసం తప్పుగా రాసినా వాళ్లు, వీళ్లు నయం.
👉 మనకు తెలిసిన వాళ్ళు ఇలా పలికితే ళ,ల తేడా తెలుపుదామా? 👍
🧐ఇంకా ఏమైనా అక్షరాలు మిగిలాయా?

28/1/24
👉 అక్షరాలు అన్నీ అయిపోయాయి. అయితే ఇది గమనించారా!?
కచటతప వరుసల్లో ఆఖరు ఐదో అక్షరాలు ౙ,ఇ+,ణ,న,మ ఇవన్నీ ముక్కుతో పలికేవి. కాబట్టి అనునాసికాలు అంటారు.
👉వీటిలో మొదటి రెండు బాక్సుల్లో చేర్చబడ్డాయి. హతవిధీ!
👉 ఇక అం, అః ల గురించి. ఇవి అచ్చుల లోనూ, హల్లుల లోనూ వస్తాయి కాబట్టి ఉభయాక్షరాలు అని పిలుచుకుంటున్నాం.
💐 వివరంగా రేపు 👋

29/1/24
నిన్నటి అనునాసికాలు (ముక్కు తో పలికేవి), అం(ం) మధ్య సంబంధం చూద్దాం.
👉కింది పదాలలో‌ ం శబ్దం గమనించండి.
కంగారు, కంచం, కంఠం, కంద, కంపం లలో గా, చ, ఠ, ద, ప లకు ముందు వచ్చే సున్న కు వరుసగా ౙ్, ఇ్+, ణ్, న్, మ్ లుగా శబ్దం వస్తుంది కదా! 

👉అదే… కంచం, కంఠం, కంపం లలో పదం ఆఖరులో వచ్చే సున్న కు మ్ శబ్దం రావడం చూస్తాం. అందుకే పదాల ఆఖర్లో ము ఉంటే ం తో ముగిస్తాం.
💐సున్న విషయం ఇంకా ఉంది.👋
30/1/24


31/1/24
సున్న విషయం మాట్లాడుకుంటున్నాము.
నిన్నటి ఉదాహరణలే తీసుకుని సున్న విలువను మరింత తెలుసుకుందాం.
👉కంగారు, కంచం, కంఠం, కంద, కంపం ఈ పదాలను వాటిలోని సున్న చేస్తున్న శబ్దాన్ని బట్టి ఇలా రాయాలి.
👉 కౙ్గారు, కఇ్+చమ్, కణ్ఠమ్, కన్ద, కమ్పమ్. కానీ ఈ అనునాసికాల జాగాలో ంను ఉపయోగిస్తున్నాం. 


సున్న ఉపయోగించటం బాగానే ఉంది కానీ ణ,న,మ లు తప్ప మిగతా రెండు ౙ,ఇ+ బాక్సుల్లో చేర్చబడ్డాయి. ణ కు కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. ళ ల గా మారుతున్నట్టే ణ న గా మారబోతున్నది.
💐 సశేషం 👋

1/2/24
👉 సున్న పదం లోని హల్లుకు ముందు, పదం ఆఖరులో ఉంటే వచ్చే శబ్దాలు అర్థం చేసుకున్నాం.
ఇక ఈ పదాలలో సున్న ను గమనించండి.
కిం, ఓం, క్లీం, హ్రీం… వీటిలో సున్న మ్ శబ్దం ఇస్తూనే దానికి ముందు ఉన్న అచ్చుకు తోడవుతుంది. చివరికి పెదాలు దగ్గరగా వచ్చి తగిలీతగలకుండా ఉంటుంది.
అందుకే సున్న అచ్చుల లోనూ హల్లుల్లోనూ పరిగణిస్తున్నారు.
💐 రేపు ః విసర్గ విషయం 👋


2/2//24
👉విసర్గ ః ను హ్ శబ్దం వచ్చేలా పలుకుతాం. ః, హ రెండూ కూడా కంఠం నుండే పుట్టడం తెలుసు కదా?
అయితే…
ఈ పదాలలో ః ను ఎలా పలుకుతున్నామో చూడండి.
👉రామః, విష్ణుః, త్రిః, శరైః లలో రామహ, విష్ణుహు, త్రిహి, శరైహి లుగా పలుకుతున్నాం. 
👉సరిగ్గా అనుసరిస్తే రామహ్, విష్ణుహ్, త్రిహ్, శరైహ్ గా చివర హ్ శబ్దం వచ్చేలా పలకాలి.

3/2/24
తెలుగు అక్షరమాల మొత్తం అయిపోయిందా?🤔
👉బాక్సులో ఉండిపోయిన అరసున్న ఉందిగా! 😃
మామూలుగా తెలుగు పద్యాలలో కనిపిస్తుంది. అయితే దానికి శబ్దం లేదు. ఇంగ్లీష్ లో లాగా సైలెంట్ లెటర్ అన్నమాట!
భారతీయ భాషలలో ఈ సైలెంట్ లెటర్ లు లేవుగా! మరి… మనకెందుకు? అవసరం లేకపోయినా ఎందుకు పుస్తకాలలో కనిపిస్తుంది? తరువాతి తరాలు మరిచిపోకుండా పెడుతున్నారు. ఎందుకు?
💐 ఆ విషయం రేపు. 👋

4/2/24
ఁ . దీని గురించి నిన్న జ్ఞాపకం చేసుకున్నాం.
ప్రింటింగ్ టెక్నాలజీ రాకముందు దీనిని వాడేవారు. ముందు…
అతండు, వీండ్లు, వాండ్లు… ఇలా అతడు, వీళ్ళు, వాళ్ళు లకు బదులు రాసేవారు. అయితే కొండ, బండి వీటిని ఎలా రాసేవారో ఊహించగలరా? 
కొండ్డ, బండ్డి ఇలా రాసేవారు. పలికే సమయంలో డ కు డ ఒత్తు లేకుండా పలికేవారు. 

అతండు, వీండ్లు మొదలైనవి క్రమంగా అతడు, వీళ్ళు అని పలకడం అలవాటయి సాహిత్యంలో అవసరమైన చోట ఁ వాడటం మొదలైంది.
రాయలసీమ ప్రాంతపు ఒక యూట్యూబ్ చానెల్ లో వీండ్లు అని విన్నట్టు జ్ఞాపకం.
💐తెలుగు పద్యాల కారణంగా ఁ గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది.
💐ఁ గురించి గుర్తు చేసిన తమ్ముడు విజయ్ కు ధన్యవాదాలు, ఆశీస్సులు.


5/2/24
సరే! తెలుగు వర్ణమాల లోని అక్షరాల గురించి చెప్పుకున్నాం. మరి … ఇంగ్లీషు అక్షరాల గురించి చూద్దామా!?
👉ఉన్న 5 అచ్చులు అక్కడక్కడా విసిరేసినట్టు ఉంటాయి. మరి 21 హల్లులు?
ఒక పద్ధతి గమనించం.
👉మనదేశ భాషలలో మాదిరిగానే పరుషాలు (plosives), ఊష్మాలు (fricatives), అనునాసికాలు (nasals) వంటి చర్చ కనిపిస్తుంది. 
👉 Silent letters మన దేశ భాషలలో (adjustment) చూడం.

6/2/24
ఇక మన దేశభాష ఐనది, లిపి మనది కానిది ఐన ఉర్దూ అక్షరాల గురించి చూద్దాం!
ఇక్కడ ఇంగ్లీషు లాగా కాకుండా అక్షరాలు ఆకారం ప్రకారం సాగడం తరువాతి స్లైడ్ లో చూడవచ్చు.
👉ఈ పద్ధతితో తేడాను బట్టి చదవడం నేర్చుకోవడం సులభం. అయితే పదం అర్థం తెలిసి ఉంటేనే సరిగా పలుకగలం. లేకపోతే వార్త(خبر) సమాధి(خبر)గా మారిపోతుంది.😃
👉 ఒకేఒక చుక్క పదాన్ని మార్చేయొచ్చు.
💐 రేపు ఇంకొంత👍

7/2/24
ఇంగ్లీష్ లో కేవలం 5 అచ్చులతోనే భారతీయ భాషలలోని 12 అచ్చుల శబ్దాలు ఏర్పరచుకుంటున్నట్లు, ఉర్దూలో కూడా 4 అచ్చులతోనే పని ముగిస్తారు.
తమాషా ఏంటంటే و అనే అక్షరం ఉ,ఓ,వ అనే శబ్దాలను ఇస్తుంది సందర్భాన్ని బట్టి.
అలాగే ఒకే శబ్దాన్ని ఇచ్చే రెండు, మూడు అక్షరాలు కూడా ఉన్నాయి. ఉదా. స కు س ص ث , ౙ కు ض ذ ظ ఇలా…

అదో గమ్మత్తైన భాష. ఏ పదాన్ని ఎలా పలకాలో ఆ భాష వచ్చిన వారికే తెలుస్తుంది. ఏ అక్షరం ఎప్పుడు వాడాలో భాష వస్తేనే తెలుస్తుంది.
మన తెలుగు అలా కాదే భాష రాకపోయినా తప్పుల్లేకుండా చదువచ్చు, డిక్టేషన్ రాసేయొచ్చు.
అయినా మన భాషంటే మనకు చులుకనేగా…



8/2/24
పదం అర్థం తెలిస్తేనే సరిగా పలుకగల మనదేశ భాష ఒకటి చూద్దామా!
అది తమిళ భాష. కారణం… ఐదు అక్షరాలకు ఒకే సంకేతం. 
తర్వాతి స్లైడ్ చూడొచ్చు. 
కచటతప వర్గాలకు ఒక్కొక్క సంకేతమే. యర..హ లు వేర్వేరుగా ఉంటాయి.
అందుకే తమిళం నేర్చుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం.


9/2/24
👉 ఇతర భారతీయ భాషల వర్ణమాలలు కూడా గమనిస్తూ ఉండండి. సంస్కృత వర్ణమాల నుండి కొంచెం కొంచెం తేడాలతో సాగుతాయి.
👉 ఉదాహరణకు బెంగాలీ భాషలో వ లేదు. బదులుగా బ వాడుతారు. అందుకే ఆయన రబీంద్రనాథ్ రాగుర్ అయ్యాడు.
👉 ఈ అక్షరాల మురమురాలు రుచిగా కరకరగా ఉన్నాయనే అనుకుంటున్నాను. అవునయితే ఒక 👍 వేసుకోండి. 👋

Comments

Seetha said…
👍 అక్షర లక్షణ విశ్లేషణ చాలా సులభంగా అర్థమయ్యేలా ఉంది.ధన్యవాదాలు బాబాయ్
Krishna said…
బాగుంది బాబాయ్

Popular posts from this blog

టీచర్

బాలల రామాయణం